Aug 20,2023 20:49

కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌, వార్డు మెంబర్‌ను అభినందిస్తున్న డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : టిడిపి అధినేత చంద్రబాబు.. కొత్తగా చంద్ర బాబా అవతారమెత్తి తాయత్తులు ఇస్తారేంటని, ఆయన తాయత్తులకు అంత బలమే ఉంటే గత ఎన్నికల్లోనే గెలిచి ముఖ్యమంత్రి అయ్యేవారని డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి వ్యాఖ్యానించారు. వైసిపికి ప్రజాదరణ మరింతగా పెరిగిందని, పంచాయతీ ఉప ఎన్నికల ద్వారా ఈ విషయం రుజువైందని వెల్లడించారు. ఆదివారం విజయనగరంలోని తన నివాసం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలకు ఏ ఇబ్బంది కలిగినా, ఎటువంటి అవసరం వచ్చినా వైసిపి నాయకులు అండగా ఉన్నారన్న ధైర్యం కల్పించామన్నారు. రానున్న కాలంలో టిడిపికి ఓటు అడిగే హక్కు లేదని స్పష్టం చేశారు. ఈ దఫానే ఆ పార్టీకి చివరి ఎన్నికలన్నారు. ఒకప్పుడు ప్రధాని మోడీనే తిట్టి, మళ్లీ ఇప్పుడు బిజెపితో కలిసి వెళ్లాలని ఆరాటపడుతున్నారని విమర్శించారు. ఒకవైపు తానే ముఖ్యమంత్రిని అని పవన్‌.. మరోవైపు తమదే అధికారమని చంద్రబాబు, లోకేష్‌ అంటున్నారని, అసలు వీరు కలిసి పోటీ చేస్తారో? లేదో ప్రజలకైనా చెబుతారా? అని ప్రశ్నించారు. అనంతరం పంచాయతీ ఉప ఎన్నికల్లో పడాలపేట సర్పంచ్‌గా ఎన్నికైన సువ్వాడ శ్రీదేవి, కొండకరకాం వార్డు మెంబర్‌ తుమ్మగంటి మంగకు ఈ సందర్భంగా కోలగట్ల శాలువా కప్పి పుష్పగుచ్ఛాలు అందించి అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో వైసిపి మండల అధ్యక్షులు నడిపేన శ్రీనివాసరావు, ఎఎంసి చైర్‌పర్సన్‌ శశిభార్గవి, తదితరులు పాల్గొన్నారు.
చిన్నారికి సాయం
కొండకరకాం గ్రామానికి చెందిన తుంపిల్లి గణేష్‌కు ఆరు నెలల కుమారుడు గుణవర్థన్‌ ఉన్నాడు. చిన్నారికి మూడు నెలల వయస్సులో బ్రెయిన్‌ సంబంధిత వ్యాధి వల్ల సర్జరీ చేయాల్సి వచ్చింది. హైదరాబాద్‌లోని ఓ ప్రయివేట్‌ ఆసుపత్రిలో వైద్యం అందించాలి. ఆరోగ్యశ్రీ పథకం వర్తించకపోవడం, ఆ కుటుంబానికి వైద్యం చేయించే స్తోమత లేకపోవడంతో డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామిని కలిసి తమ పరిస్థితి విన్నవించుకున్నారు. వెంటనే స్పందించిన ఆయన సిఎం సహాయ నిధికి ప్రతిపాదించారు. అక్కడ నుంచి ఆమోదం లభించడమే కాక, రూ.1.20 లక్షలు మంజూరు చేశారు. దీంతో ఆ చెక్కును ఆదివారం తన నివాసం వద్ద చిన్నారి కుటుంబ సభ్యులకు కోలగట్ల అందజేశారు.