ప్రజాశక్తి - నెల్లిమర్ల : ఏపి మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఛలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆ సంఘం జిల్లా నాయకులు ఏ. జగన్మోహన్ రావు పిలుపునిచ్చారు. సోమవారం నెల్లిమర్లలో ద్విచక్ర వాహనాల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రావు మాట్లాడుతూ మున్సిపల్ వర్కర్స్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 24న ఛలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహి స్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా మున్సిపల్ అప్కాస్ సిబ్బందిని పర్మినెంట్ చేసి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రామతీర్థం, ముషిడిపల్లి, నెల్లిమర్ల పంప్ హౌస్ కార్మికులను కార్పొరేషన్ కార్మికులుగా గుర్తించాలన్నారు. ఇంజనీరింగ్ సిబ్బందికి రిస్క్ అలవెన్స్, హెల్త్ అలవెన్స్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. సిపిఎస్ రద్దు చేసి పాత పద్దతిలో పించన్ కొనసాగించాలన్నారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ కార్మిక సంఘం నాయకులు టి. బాబూ రావు, హరి, మహిళా కార్మికులు పాల్గొన్నారు.
బొబ్బిలి: మున్సిపల్ కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ సిబ్బంది అందర్నీ 6 నెలల్లో పర్మినెంట్ చేస్తామని కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్‌కు పెద్ద తేడా లేదని 2019 ఎన్నికల ముందు అప్పటి ప్రతిపక్ష నేత ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాగ్దానం చేసి మాట తప్పారని సిఐటియు జిల్లా అధ్యక్షులు పి. శంకరరావు అన్నారు. ఈ నెల 24న విజయవాడలో జరగనున్న చలో విజయవాడ కార్యక్రమంలో బొబ్బిలి నుంచి వేలాది మంది పాల్గొని జయప్రదయం చేయాలని కోరారు. ఈ మేరకు సోమవారం కోవెల సెంటర్‌లో కార్మికలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చి నాలుగున్నర సంవత్సరాలు గడిచినా మనకు ఇచ్చిన వాగ్దానాలకు అతీగతి లేదన్నారు. ఈ సమావేశంలో యూనియన్ ప్రెసిడెంట్ జి. గౌరీ, కార్యదర్శి జె. రామారావు, కమిటీ సభ్యులు జి. వాసు, బి. వెంకటి కార్మికులు పాల్గొన్నారు.










