Sep 10,2023 20:21

చెరువు గర్భంలో ఉన్న ఈ రోడ్డునే తవ్వి మట్టిని తరలిస్తూ కబ్జా చేస్తున్నారు..

రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారస్తులు చెరువులు, కాలువలు, గెడ్ల వద్ద భూములు తక్కువ రేటుకు కొని ఆ పక్కనే ఉన్న ప్రభుత్వ భూములన్నింటినీ కబ్జా చేసి తమ స్వాధీనంలోకి తెచ్చుకుంటున్నారు. ఎక్కడెక్కడ నుంచో వచ్చి ఇక్కడ భూములను కొని రియల్‌ ఎస్టేట్‌లో భాగంగా లేఅవుట్‌లు వేసి వ్యాపారం చేసుకుంటున్నారు.. అయితే ఎకరం భూమి కొని దాని పక్కనే ఉన్న ప్రభుత్వ భూముని కూడా కబ్జా చేసి దాన్ని రెండు ఎకరాలు భూమిగా తయారు చేసుకుని విక్రయించుకుని సొమ్ము చేసుకుంటున్నారు. ఈ ప్రభుత్వ భూములను కలుపుకోవడానికి ప్రభుత్వంలో ఉన్న పెద్దల పేర్లు చెప్పి అధికారులపై ఒత్తిడి తెచ్చి భయపెట్టి పనులు చక్కబెట్టుకుంటున్నారు. ఇందులో భాగంగానే గుండాలపేటలో నారాయణరాజు చెరువు ఆక్రమణకు గురైంది.
ప్రజాశక్తి- డెంకాడ : 
మండలంలోని పెద్ద తాడివాడ పంచాయతీ పరిధిలోని గుండాలపేటలోని నారాయణరాజు చెరువు గర్భంలో సుమారు 16 ఎకరాల జిరాయితి భూమిని నవరత్న పేరుతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారస్తులు కొనుగోలు చేసి లేఅవుట్‌ వేశారు. అయితే ఇక్కడ చెరువు గర్భంలో సుమారు కిలోమీటరు పొడువున చెరువు గట్టును ఉపాధి హామీ పథకం ద్వారా రైతులు మట్టిని వేశారు. ఆ మట్టిని రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారస్తుడు మొత్తం తొలగించి అక్రమంగా మట్టిని తరలించి తన సైట్లో వేసుకున్నాడు.పై పెచ్చు ఆ గట్టును తొలగించి చెరువు గర్భాన్ని ఆక్రమించేసుకుంటున్నాడు. రైతులు అడుగుతారని అడ్డుకుంటారని రాత్రి సమయంలో చెరువు గట్టుకు వేసిన మట్టిని అక్రమంగా తరలించాడు. ఈ చెరువు కింద నాలుగు చెరువుల ఆధారపడి ఉన్నాయి. ఈ చెరువు నిండితే మిగిలిన చెరువులకు అన్నింటికీ నీరు వెళుతుంది. ఈ నాలుగు చెరువుల కింద సుమారు 400 ఎకరాలు భూమి ఉంది. సుమారు 450 మంది రైతులు పంటను సాగు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఈ మట్టిని తరలించి చెరువు గర్భాన్ని కబ్జా చేయడం వల్ల చెరువులో నీరు స్టాకు ఉండదని దీంతో పంటలకు నీరు అందదని అసలే వర్షాధారంతో ఉన్న భూములని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై స్థానిక తహశీల్దార్‌కు ఫిర్యాదు చేసినట్లు రైతులు చెబుతున్నారు. వెంటనే స్పందించిన తహశీల్దార్‌ పి. ఆదిలక్ష్మి విఆర్‌ఒ, ఆర్‌ఐలను క్షేత్రస్థాయికి పంపించి విచారించగా చెరువు గర్భంలో వేసిన గట్టు మట్టిని తరలించడంతో పాటు చెరువు గర్భాన్ని రియల్‌ వ్యాపారి కబ్జా చేస్తున్నట్లు గుర్తించారు. ఈ నివేదికను ఇరిగేషన్‌, మైన్స్‌ అధికారులకు పంపిస్తామని తెలిపారు. కాగా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారిపై చర్యలు తీసుకుని ఆక్రమణలను తొలగించకపోతే జిల్లా కలెక్టర్‌, ఆర్‌డిఒ, ఇరిగేషన్‌, మైన్స్‌ అధికారులను తామే నేరుగా కలిసి ఫిర్యాదు చేస్తామని రైతులు హెచ్చరిస్తున్నారు.