ప్రజాశక్తి-కొత్తవలస : విజయనగరం జిల్లా కొత్తవలస మండలం చింతలపాలెంలో విషాదం చోటుచేసుకుంది. విశాఖపట్నం జిల్లా మర్రిపాలెం ఎఫ్‌సిఐ కాలనీకి చెందిన భర్త, భార్య, కుమార్తె చింతలపాలెం గ్రామంలోని వ్యవసాయ బావిలో పడి మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు అనుమానాస్పద ఘటనగా కేసు నమోదు చేశారు. మంగళవారం ఉదయం విగత జీవుల్లా తేలియాడుతున్న వీరిని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతులను ఎమ్‌డి మొహినుద్దీన్ (46), అతని భార్య సంషినిషా (39), కుమార్తె ఫాతిమా జహీదా (17) గా పోలీసులు గుర్తించారు. వీరు ఓ ప్రయివేటు వాహనంలో సోమవారం సాయంత్రం కొత్తవలస సమీపంలోని చింతపాలెంలో తమ స్థలాన్ని చూసేందుకు వెళ్లారు.

అనంతరం అక్కడే బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారా... లేక మరేదైనా జరిగిందా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. విజయనగరం డిఎస్పీ జి.గోవిందరావు, కొత్తవలస సిఐ చంద్రశేఖర్ ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ సందర్బంగా సిఐ మాట్లాడుతూ కుమారుడు మహమ్మద్ అలీతో పాటూ బంధువులను విచారించిన్నట్లు తెలిపారు. ఘటనకు సంబంధించి అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. మృతదేహాలను బావిలోంచి బయటకు తీసి శవపంచనామా నిర్వహించి శవపరీక్షకు ఎస్.కోటకు తరలించారు. ఈ ఘటనపై పోలీసుల దర్యాప్తు అనంతరం మరిన్ని నిజాలు వెలుగుచూసే అవకాశలున్నాయని పలువురు భావిస్తున్నారు.










