ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : మున్సిపల్ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికులు బతుకు పోరాటం చేస్తున్నారు. తమకు పనికితగ్గ వేతనం ఇవ్వాలని, వెట్టి చాకిరీ నుంచి విముక్తి కలిగించాలని, ఉద్యోగ భద్రత కలిపించాలని కోరుతున్నారు. ఇందుకోసం దశల వారీగా నెల రోజులుగా పోరాటం సాగిస్తున్నారు. ప్రభుత్వంతో అమీతుమీ తేల్చుకునేందుకు 24న చలో విజయవాడ వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.
జిల్లా కేంద్రంతో పాటు రాజాం, బొబ్బిలి, నెల్లిమర్ల మున్సిపాలిటీల్లో 895 మంది, పార్వతీపురం మన్యం జిల్లాలోని పార్వతీపురం, సాలూరు, పాలకొండ మున్సిపాలిటీల్లో 350 మంది కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికులు ఉన్నారు.వీరిలో పారిశుధ్య కార్మికులతో పాటు వాటర్ వర్క్స్, పంపు హౌస్, వాటర్ సప్లరు, ప్లాంటేషన్ కార్మికులు, క్లాప్ వాహన డ్రైవర్లు ఉన్నారు. వీరంతా తమకు ఉద్యోగ భద్రత కల్పించి కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీ మేరకు తమను రెగ్యులర్ చేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్, కార్పొరేషన్ కమిషనర్లకు, స్థానిక ఎమ్మెల్యేలకు వినతులు అందజేశారు. అయినా ప్రభుత్వం నుంచి సరైన సమాధానం రాకపోవడంతో పనులు బంద్ చేసి ఈనెల 24న చలో విజయవాడకు తరలి వెళ్లేందుకు సిద్దమవుతున్నారు. ప్రధానంగా మున్సిపల్ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులకు 010 పద్దు కింద వేతనాలు చెల్లించాలని, టైమ్ స్కేల్ వర్తింప చేయాలని కార్మికులు కోరుతున్నారు.
అధికారంలోకి వేస్తే సమాన పనికి సమాన వేతనం, సిపిఎస్ రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరుతున్నారు. ఆప్కాస్‌లో ఉన్న కార్మికులందరికీ సంక్షేమ పథకాలు అమలు కాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. పర్మినెంట్ కార్మికులకు సరెండర్ లీవ్ డబ్బులు చెల్లించాలని, ఇంజినీరింగ్ కార్మికులకు స్కిల్డ్, సెమీ స్కిల్డ్, అన్ స్కిల్డ్ వేతనాలు చెల్లించాలి, రిస్క్, హెల్త్ అలవెన్స్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. రోజూ రోజుకు పట్టణాల విస్తరణ మేరకు సిబ్బంది సంఖ్యను పెంచకపోవడంతో పని భారం అధికంగా ఉంది. రక్షణ, భద్రతా సౌకర్యాలు, పనిముట్లు సకాలంలో ఇవ్వడం లేదు. దీంతో కార్మికులు రోగాలు బారిన పడి మరణిస్తున్నారు.
అరకొర వేతనాలతో క్లాప్ వాహన డ్రైవర్లు
క్లాప్ వాహన డ్రైవర్లకు అరకొర వేతనాలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. తమకు రూ.18,500 జీతం చెల్లించాలని కార్మికులు కోరుతున్నారు. ఇవన్నీ రాష్ట్ర వ్యాప్త సమస్యలు అయితే స్థానికంగా అనేక సమస్యలు కార్మికులు ఎదుర్కొంటున్నారు. వాటిలో ప్రధానంగా
రామతీర్థాలు, ముషిడిపల్లి, నెల్లిమర్ల మాస్టర్ పంప్ హౌస్‌లో పనిచేస్తున్న 70 మందిని టర్న్‌కీ సిస్టం రద్దు చేసి ఆప్కాస్‌లో చేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. ప్లాంటేషన్ విభాగంలో 60 మందిదీ అదే పరిస్థితి. ఆప్కాస్ వచ్చిన తరువాత ఏడుగురు కార్మికులు రిటైర్ అయ్యారు, వారి బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వకుండా తాత్సారం చేస్తున్నారు. 2020 ఆగస్టు 1 తరువాత మరణించిన కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికుల కుటుంబాలకు రూ.2 లక్షలు ఆర్థిక సహాయం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని కోరుతున్నా రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక నాయకులు, అధికారులు పట్టించుకోవడం లేదు. మరోవైపు ప్రభుత్వం 3నెలలుగా హెల్త్ అలవెన్స్ బకాయి చెల్లించాల్సి ఉంది. అంతే కాకుండా యూనిఫాం, గ్లౌజులు, చెప్పులు, నూనె వంటి రక్షణ పరికరాలు రెండేళ్లగా పంపిణీ చేయక పోవడంతో కార్మికులు రోగాలు భారిన పడుతున్నారు.
పెత్తనం చెలాయించే వారు అధికం
మున్సిపల్ కార్మికులపై పెత్తనం చెలాయించే సిబ్బంది ఎక్కువయ్యారు. సచివాలయ కార్యదర్శులు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు కార్మికులకు చిన్న చిన్న కారణాలకు కూడా ఎలాంటి నోటీసులు లేకుండా రోజుల తరబడి పనుల నుంచి నిలుపుదల చేస్తున్నారు. మరోవైపు పెరుగుతున్న పని భారం, ఒత్తిడి కారణంగా అనేకమంది కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో జరుగుతున్న పోరాటంలో చలో విజయవాడ కార్యక్రమం ద్వారా కార్మికులు సత్తా చాటేందుకు సిద్దమవుతున్నారు.
కమిషనర్ కు సిఐటియు నోటీసులు
తమ సమస్యల పరిష్కారానికి ఈనెల 24 నుంచి పనులు బంద్ చేసి చలో విజయవాడకు వెళ్తున్నట్లు మంగళవారం అసిస్టెంట్ కమిషనర్ ప్రసాదరావుకు ఎపి మున్సిపల్ వర్కర్స్ అండ్ కార్మికులు యూనియన్ రాష్ట్ర నాయకులు కె.జగన్మోహన్ కార్మికులతో కలిసి నోటీసు అందజేశారు. చలో విజయవాడ కు కార్మికులు అధిక సంఖ్యలో తరలి రావాలని జగన్మోహన్ పిలుపునిచ్చారు.
ఆప్కాస్ వద్దు.. పర్మినెంట్ చేయాల్సిందే!
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ కార్మికులందరినీ పర్మినెంట్ చేస్తామని ప్రకటించారు. మహాసంకల్ప యాత్రలో భాగంగా విజయనగరం కొత్తపేట వద్ద జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి వినతిపత్రం ఇచ్చాం. 'మున్సిపల్ కార్మికుల కాళ్లు కడిగి ఆ నీళ్లను నెత్తిన జల్లుకున్నా వారి రుణం తీర్చుకోలేనిది . లక్ష రూపాయలు జీతం ఇచ్చిన తక్కువే. మూడు నెలలు ఆగండి మన ప్రభుత్వం వస్తుంది. అందర్నీ పర్మినెంట్ చేస్తాం' అంటూ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి నాలుగేళ్లయినా పర్మినెంట్ చేయలేదు. పర్మినెంట్ చేసి మాట తప్పని మడం తిప్పని నేతగా ముఖ్యమంత్రి రుజువు చేసుకోవాలి. లేదంటే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు.
ఎ.జగన్మోహన్‌రావు, మున్సిపల్ వర్కర్స్, కార్మికుల యూనియన్ నాయకులు










