బస్సును అడ్డుకుంటున్న ప్రయాణికులు
ప్రజాశక్తి-విజయనగరం కోట : జిల్లాలో సిఎం జగన్మోహన్‌రెడ్డి పర్యటన నేపథ్యంలో జిల్లాలోని అన్ని డిపోల నుంచి 300 బస్సులను తరలించారు. దీంతో బస్సులు అందుబాటులో లేక శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు విజయనగరం, పార్వతీపురం ఆర్‌టిసి కాంప్లెక్సుల్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మధ్యాహ్నం 1గంటకు సిఎం సభ ముగిసినా రాత్రి 8గంటల వరకు బస్సులు అందుబాటులోకి రాకపోవడం, స్వస్థలాలు చేరేందుకు బస్సులు లేకపోవడంతో విజయనగరం ఆర్‌టిసి కాంప్లెక్సులో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. వచ్చిన బస్సులను అడ్డగించి నిరసన తెలిపారు. సిఎం పర్యటనకు బస్సులన్నింటినీ తరలించేస్తే ఎలా అని ప్రశ్నించారు. జనాల రాకపోకల పరిస్థితి ఏమిటని ఆర్‌టిసి అధికారులను నిలదీశారు.










