Sep 08,2023 21:17

లారీలను అడ్డుకుంటున్న కంటకాపల్లి గ్రామస్తులు

ప్రజాశక్తి-కొత్తవలస : కంటకాపల్లి రైల్వేస్టేషన్‌ నుంచి వస్తున్న బొగ్గు లారీలను నిలుపుదల చేయాలని ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. కంటకాపల్లి బొగ్గు యార్డు నుంచి రవాణా చేస్తున్న లారీల వల్ల వస్తున్న దుమ్ము, ధూళితో తమ బతుకులు ఆస్పత్రి పాలవుతున్నాయని గ్రామస్తులు ఆవేదన చెందారు. ఈ మేరకు కంటకాపల్లి రైల్వేయార్డ్‌ నుంచి వస్తున్న బొగ్గు లారీలను అంబేద్కర్‌ కాలనీ వద్ద శుక్రవారం గ్రామస్తులు అడ్డుకున్నారు. నాయకులు మదిన అప్పలరాం, బోదల సురేష్‌ కుమార్‌, కాటకాపల్లి సర్పంచ్‌ పీతల కృష్ణ, చినరావుపల్లి సర్పంచ్‌ గోసాల దేవుడు, కొత్తవలస సర్పంచ్‌ మచ్చ ఎర్రయ్య రామస్వామి, ప్రజలు రోడ్డుకు అడ్డంగా బైఠాయించారు. ఎన్ని సంవత్సరాలైనా పరిస్థితి ఇలానే ఉంటుందని, ఇప్పటికైనా ఒక కొలిక్కి రావాలని భీష్మించుకు కూర్చున్నారు. సాయంత్రం వరకు టెంట్‌ వేసుకుని కాపలా కాశారు. సమస్యకు పరిష్కారం దొరికే టెంటును కొనసాగిస్తామని అప్పలరాం స్పష్టంచేశారు.
బొగ్గు కాంట్రాక్టరు రావడం లేదు : ఎమ్మెల్యే
కంటకాపల్లి రైల్వే యార్డు పరిస్థితి దుర్భర స్థితిలో ఉందని, రైల్వే కాంట్రాక్టరుతో మాట్లాడి రోడ్డు వేయించాలని ఎన్నిసార్లు ఫోన్‌ చేసి చెప్పినా కనీసం పట్టించుకోలేదని ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు చెప్పారు. కంటకాపల్లి గ్రామస్తుల ఆందోళన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కడుబండి హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. దుమ్ము, ధూళితో ఇక్కడి ప్రజలు ఎలా జీవించగలరని స్థానికులు ప్రశ్నించారు. వెంటనే ఎమ్మెల్యే స్పందిస్తూ రైల్వే కాంట్రాక్టరును రప్పించి, ఇక్కడే మాట్లాడాలని తెలిపారు. రైల్వేస్టేషన్‌ నుంచి బొగ్గు రవాణా చేస్టున్న కారణంగా విద్యార్థులు, అంగన్వాడీ చిన్నారులు ప్రతిరోజూ చాలా ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. ఏదేమైనా ఇక్కడ పరిస్థితి చక్కదిద్దే వరకు సమస్య పరిష్కారం కాదన్నారు.