Sep 06,2023 22:00

మద్యం షాపులో మద్యం కొని బ్యాగ్‌లోతరలిస్తున్న దృశ్యం

ప్రజాశక్తి- బొబ్బిలి :  వైసిపి అధికారంలోకి వస్తే మద్యపానాన్ని నియంత్రిస్తామని ప్రకటించిన సిఎం జగన్మోహన్‌ రెడ్డి హామీ అమలు కాలేదు. గ్రామాల్లో పూర్తిగా బెల్ట్‌ షాపులపై నిషేధం ఉన్నప్పటికీ బొబ్బిలిలో ఎక్కడ అమలు కావడం లేదని విమర్శలు వస్తున్నాయి. మద్యాన్ని నియంత్రిస్తామని చెప్పిన ప్రభుత్వం పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో మద్యం ఏరులై పారిస్తోంది. బొబ్బిలిలో ఒక మద్యం మాఫియా తయారై గ్రామాల్లో బెల్ట్‌ షాపులకు మద్యాన్ని సరఫరా చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మద్యం మాఫియా నుంచి, బెల్ట్‌ షాపుల నిర్వాహకులు నుంచి సంబంధించిన అధికారులకు రూ. లక్షల్లో ముడుపులు అందుతున్నట్లు సమాచారం.
ప్రభుత్వ మద్యం షాపులు నుంచి మద్యం సరఫరా
బొబ్బిలి పట్టణంలో ఐదు ప్రభుత్వ మద్యం దుకాణాలు ఉన్నాయి. వీటి నుంచి బెల్ట్‌ షాపులకు మద్యం సరఫరా అవుతుంది. బజారు సంచులు, స్కూల్‌, కళాశాల బ్యాగులలో మద్యాన్ని తరలిస్తున్నారు. మద్యం మాఫియాలో ప్రభుత్వ మద్యం దుకాణాలలో పని చేస్తున్న ఉద్యోగులు కూడా ఉండడంతో బెల్ట్‌ షాపులకు మద్యం సరఫరా సులభంగా వెళ్తుంది. ప్రైవేట్‌ వ్యక్తులు, ప్రభుత్వ మద్యం దుకాణాలలో పని చేస్తున్న ఉద్యోగులు ఒక పట్టణ పోలీసు అధికారుల సహాయ సహకారాలతో మద్యం మాఫియాగా ఏర్పడి బెల్ట్‌ షాపులకు మద్యాన్ని తరలిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
రూ. లక్షల్లో చేతులు మారుతున్న వైనం
బెల్ట్‌ షాపులు నిర్వహణకు సహకరిస్తున్న అధికారులకు రూ. లక్షల్లో ముడుపులు అందుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. బొబ్బిలి పట్టణానికి ఏడు కిలోమీటర్లు దూరంలో ఒక పంచాయతీలో నెలకు బెల్ట్‌ షాపు పాట రూ.30వేలుకు అయింది. ఒక్క మద్యం సీసాకు ఎమ్మార్పీ ధరకు అదనంగా రూ.30 వేసుకుని అమ్మాలని నిబంధన ఉంది. ఆగ్రామంలో రోజుకు 150 మద్యం సీసాలు వరకు అమ్ముడుపోతాయి. నెలకు 4500 మద్యం సీసాలు అమ్ముడుపోగా ఆగ్రామ బెల్ట్‌ షాపు నిర్వాహకునికి నెలకు రూ.1.35లక్షలు ఆదాయం వస్తుంది. బెల్ట్‌ షాపుపై దాడి చేసి కేసు నమోదు చేయకుండా ఉండేందుకు సంబంధిత అధికారులకు ఆగ్రామం నుంచి నెలకు రూ.50వేలు ఇస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఒక బెల్ట్‌ షాపు నుంచి నెలకు రూ.50వేలు వస్తున్నాయంటే మండలంలో ఉన్న 38 బెల్ట్‌ షాపులు నుంచి ఎంత మొత్తంలో అవినీతి జరుగుతుందో అర్థం చేసుకోవచ్చును. ఈ పరిస్థితి బొబ్బిలి మండలంలో ఉన్న అన్ని గ్రామాల్లో ఉన్నట్లు చర్చ జరుగుతుంది.
బెల్ట్‌ షాపులకు మద్యం సరఫరా
బొబ్బిలిలో కొంతమంది మద్యం మాఫియాగా ఏర్పడి బెల్ట్‌ షాపులకు మద్యాన్ని సరఫరా చేస్తున్నారు. గ్రామాల్లో ఉన్న బెల్ట్‌ షాపులకు ప్రభుత్వ మద్యం దుకాణాలు నుంచి నేరుగా మద్యాన్ని సరఫరా చేస్తున్నట్లు చర్చ జరుగుతుంది. పట్టణంలోని ఆరు, చింతాడలో ఒక ప్రభుత్వ మద్యం దుకాణం ఉంది. ఈఅ దుకాణాలు నుంచి మద్యం మాఫియా ప్రతిరోజు మద్యాన్ని బెల్ట్‌ షాపులకు తరలిస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. బొబ్బిలి మండలంలో ఉన్న 30 పంచాయతీలలో 44 గ్రామాలు ఉన్నాయి. 38 గ్రామాల్లో బెల్ట్‌ షాపులు యథేచ్ఛగా నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
మద్యం మాఫియా దగ్గర కొనుగోలు చేయకుంటే కేసులే
బెల్ట్‌ షాపులకు మద్యం సరఫరా చేస్తున్న మద్యం మాఫియా నుంచి మద్యాన్ని కొనుగోలు చేయకుండా నేరుగా ప్రభుత్వ మద్యం దుకాణాలకు వెళ్లి కొనుగోలు చేసి బెల్ట్‌ షాపు నిర్వహిస్తే సంబంధించిన అధికారులు దాడులు చేసి కేసులు నమోదు చేస్తారని చర్చ జరుగుతుంది. ప్రభుత్వ మద్యం దుకాణాలు నుంచి మద్యాన్ని నేరుగా మాఫియా సభ్యులు బెల్ట్‌ షాపులకు తరలిస్తారు. మద్యం మాఫియా సభ్యులే అమ్మకాలను బట్టి నెలవారీ మామ్ముళ్లు వసూలు చేసి సంబంధించిన అధికారులకు అందిస్తారని చర్చ జరుగుతుంది. బెల్ట్‌ షాపులు నుంచి అక్రమ వసూళ్లకు ఒక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు కూడా చర్చ జరుగుతుంది. మద్యం మాఫియా దగ్గర మద్యం కొనుగోలు చేయని బెల్ట్‌ నిర్వాహకుల పేర్లను సంబంధిత అధికారులకు అందజేస్తే వారు నేరుగా బెల్ట్‌ షాపులపై దాడి చేసి కేసులు నమోదు చేస్తారని తెలుస్తోంది.
బెల్ట్‌ షాపులు నివారణకు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌
పట్టణ, గ్రామాల్లో అక్రమంగా నడుస్తున్న బెల్ట్‌ షాపులు నివారణకు కఠిన చర్యలు తీసుకోవాలని మహిళలు కోరుతున్నారు. గ్రామాల్లో మద్యం విచ్చలవిడిగా అమ్మకాలు జరపడంతో యువత కూడా మద్యానికి బానిసవుతున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా అధికారులు స్పందించి మద్యం నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని, మద్యం మాఫియాపై చర్యలు తీసుకోవాలని మహిళలు కోరుతున్నారు.