Sep 11,2023 21:35

విజయనగరం : ఆర్‌టిసి కాంప్లెక్సు వద్ద బైఠాయించిన టిడిపి నాయకులు, కార్యకర్తలు

 

 చీపురుపల్లి : నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకొని నిరసన తెలుపుతున్న నాయకులు
చీపురుపల్లి : నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకొని నిరసన తెలుపుతున్న నాయకులు

ప్రజాశక్తి-విజయనగరం కోట, గరివిడి, బొబ్బిలి,గజపతినగరం : టిడిపి అధినేత చంద్రబాబునాయుడును అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించడాన్ని నిరసిస్తూ టిడిపి ఆధ్వర్యాన సోమవారం చేపట్టిన బంద్‌ విజయనగరం జిల్లాలో ప్రశాంతంగా జరిగింది. విద్యాసంస్థలు, బ్యాంకులు, మార్కెట్‌ స్వచ్ఛందంగా మూతబడ్డాయి. ఆర్‌టిసి బస్సులు ఉదయం 11గంటల వరకు డిపోలకే పరిమితం కాగా, తరువాత యథావిధిగా తిరిగాయి. బంద్‌ నేపథ్యంలో పలుచోట్ల టిడిపి నాయకులను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. మరికొన్ని చోట రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపిన టిడిపి, జనసేన నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకొని అనంతరం విడిచిపెట్టారు.

బొబ్బిలి : కోటలో నిరసన తెలుపుతున్న టిడిపి నాయకులు , కార్యకర్తలు
బొబ్బిలి : కోటలో నిరసన తెలుపుతున్న టిడిపి నాయకులు , కార్యకర్తలు


టిడిపి, జనసేన నాయకులు ఉదయం 5గంటలకే విజయనగరం ఆర్‌టిసి కాంప్లెక్సు వద్దకు చేరుకొని బంద్‌ చేపట్టారు. 7గంటల సమయంలో పోలీసులు చేరుకొని బంద్‌ను విరమించాలని కోరారు. తాము శాంతియుతంగా బంద్‌ నిర్వహిస్తున్నామని, అన్ని రంగాల వారు సహకరిస్తున్నారని అన్నారు. ఈనేపథ్యంలో పోలీసులకు, నాయకులకు మధ్య కొద్దిసేపు వాగ్వివాదం జరిగింది. అనంతరం టిడిపి, జనసేన నాయకులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. అరెస్టయిన వారిలో టిడిపి నాయకులు ఐవిపి రాజు, పట్టణ అధ్యక్షులు ప్రసాదుల లక్ష్మీ వరప్రసాద్‌, కార్యదర్శి బంగారు బాబు, పార్టీ కార్యాలయ కార్యదర్శి వర్మరాజు, శ్రీనివాసరావు, తెలుగు యువత, టిఎన్‌ఎస్‌ఎఫ్‌ నాయకులు, జనసేన నాయకులు గురాన అయ్యలు, బాలు తదితరులు ఉన్నారు. అంతకుముందు నాయకులు మాట్లాడుతూ 40ఏళ్ల రాజకీయ జీవితంలో మచ్చలేకుండా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడును అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయడం అన్యాయమని అన్నారు. టిడిపి నాయకులు కర్రోతు వెంకట నర్సింగరావును గాజులరేగలోని తన నివాసం వద్ద తన నివాసం వద్దపోలీసులు గృహ నిర్బంధం చేశారు.


చీపురుపల్లిలో జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున ఆధ్వర్యంలో చేపట్టిన బంద్‌ విజయవంతమైంది. మహాత్మా.. మీరే ఈ నియంత పాలకులకు బుద్ధి చెప్పాలి అంటూ నోటికి, చెవులకు నల్ల రిబ్బన్లు కట్టుకొని టిడిపి నాయకులు వినూత్నంగా నిరసన తెలిపారు. పోలీసులు సోమవారం ఉదయం నుంచే నిర్బంధం విధించినప్పటికీ నిరసనలో పాల్గొన్నారు. ఆర్టీసీ బస్సులను నిలువరించారు. రహదారిపై బైఠాయించారు. నోటికి, చెవికి, కళ్ళకి నల్ల రిబ్బన్లు కట్టుకుని నిరసన తెలిపారు. కార్యక్రమంలో రౌతు కామునాయుడు, పైల బలరాం, దన్నాన రామచంద్రుడు, సారేపాక సురేష్‌బాబు, తాడ్డి సన్యాసినాయుడు, ముల్లు రమణ, రెడ్డి గోవింద, ధనుంజయ, చంటి, వెంకటరావు, రమణమూర్తి, నారాయణరావు, నాగరాజు, అప్పల నాయుడు, శ్రీనివాస రావు, తదితరులు పాల్గొన్నారు.


బొబ్బిలి కోట నుంచి బంద్‌ చేసేందుకు కార్యకర్తలతో బేబినాయన ర్యాలీగా వెళ్తుండగా కోట తలుపులు మూసి అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. బేబినాయన, కార్యకర్తలు ప్రతిఘటించి తలుపులు తోసేసి వెళ్లిపోయారు. ర్యాలీగా వెళ్లి తెరిచి ఉన్న షాపులను శాంతియుతంగా మూసివేయించారు. టిడిపి బంద్‌కు జనసేన మద్దతు ప్రకటించడంతో రాష్ట్ర ప్రచార కార్యదర్శి బాబు పాలూరి, నాయకులు బంద్‌కు సహకరించారు. అనంతరం కోటలో నిరసన తెలిపారు.
వాటర్‌ ట్యాంకు ఎక్కి నిరసన తెలిపిన కార్యకర్త
చంద్రబాబు అరెస్టుకు నిరసనగా పట్టణంలోని వాటర్‌ ట్యాంకుపైకి ఎక్కి టిడిపి సీనియర్‌ కార్యకర్త నారంశెట్టి మున్నా నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మున్నాను బేబినాయన, వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షులు సుంకరి సాయిరమేష్‌, ఇతర నేతలు నచ్చజెప్పి కిందకు దించారు.

 గజపతినగరం : నిరసన తెలుపుతున్న టిడిపి నాయకులు
గజపతినగరం : నిరసన తెలుపుతున్న టిడిపి నాయకులు


గజపతినగరం: టిడిపి, జనసేన నియోజకవర్గస్థాయి నాయకులు కరణం శివరామకృష్ణ, మర్రాపు సురేష్‌ ఆధ్వర్యంలో నాలుగు రోడ్ల జంక్షన్‌ వద్ద బంద్‌ నిర్వహించారు. మరోవైపు నియోజకవర్గ ఇంఛార్జి కెఎ నాయుడు వర్గమైన పివిపి రాజు, బండారు బాలాజీ, అట్టాడ లక్ష్మునాయుడు, రుంకాన అరుణలు బంద్‌ నిర్వహించారు. కార్యక్రమంలో జనసేన నాయకులు డాక్టర్‌ మిడతాన రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.