ప్రజాశక్తి-విజయనగరంకోట : బిజెపి విజయనగరం జిల్లా అధ్యక్షులుగా నడుకుదిటి ఈశ్వరరావు (ఎన్‌ఇఆర్) నియమితులయ్యారు. ఈ మేరకు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు డి.పురందేశ్వరి జిల్లా అధ్యక్షులను శుక్రవారం ప్రకటించారు. విజయనగరం పార్లమెంటు స్థానం పరిధిలోని శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం బంటుపల్లి పంచాయతీ నడుకుదిటిపాలెం గ్రామానికి చెందిన ఎన్‌ఇఆర్ మండల రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. 2014లో ఎచ్చెర్ల నియోజకవర్గంలో టిడిపి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన కిమిడి కళావెంకటరావు విజయంలో ఎన్‌ఇఆర్ కీలకపాత్ర పోషించారు. గత టిడిపి ప్రభుత్వ హయాంలో రాష్ట్ర హౌసింగ్ బోర్డు డైరెక్టర్‌గా సేవలందించారు. 2019 జులైలో అప్పటి బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కన్నా లకీëనారాయణ సమక్షంలో బిజెపిలో చేరారు. ఓ వైపు రాజకీయాల్లో చురుగ్గా ఉంటున్న ఎన్‌ఇఆర్.. నియోజకవర్గ పరిధిలో విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నారు. దీంతో ఆయన్ను బిజెపి అధిష్టానం విజయనగరం జిల్లా అధ్యక్షులుగా నియమించింది. ఈ నేపథ్యంలో పలువురు నాయకులు, అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.










