ప్రజాశక్తి - విజయనగరం ప్రతినిధి/ గజపతినగరం : జిల్లాలో వేలాది ఎకరాల భూములు బీడువారుతున్నాయి. వరి నారు ముదిరి పోయింది. ఇక నాటినా ఆశించిన దిగుబడి వచ్చే అవకాశం లేదంటూ అన్నదాత ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. మరోవైపు క్రమంగా పడుతున్న వర్షాలకు ఈ నెలాఖరు నాటికైనా వరినాట్లు పూర్తవుతాయని వ్యవసాయ శాఖ అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వరి సాధారణ విస్తీర్ణంతో పోలిస్తే సుమారు 60,852 ఎకరాల్లో ఇంకా నాట్లు పడాల్సి వుంది. గజపతినగరం, దత్తిరాజేరు, మెంటాడ, బొండపల్లి మండలాల్లో 6వేల ఎకరాల్లో నేటివరకు ఉబాలు కాలేదు. ఎస్.కోట డివిజన్‌లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది.

జిల్లాలో సాధారణ వర్షపాతం నమోదైనప్పటికీ ఉబాల విషయంలో అత్యంత వెనుకబాటు ఉంది. ఈ నేపథ్యంలో గజపతినగరం సబ్-డివిజన్ పరిధిలో ప్రజాశక్తి ప్రత్యేక పరిశీలన చేయగా దుర్భిక్ష పరిస్థితులు కనిపించాయి.
గజపతినగరం మండలంలో అధికారిక లెక్కల ప్రకారం వరి సాధారణ విస్తీర్ణం 8,892 ఎకరాలు కాగా, ఇప్పటి వరకు 6 వేల ఎకరాల్లో నాట్లు పడ్డాయి. మండలంలో కొన్ని చెరువులు జూన్‌లో నిండినా ప్రస్తుతం నీరు లేదు. చాలా చెరువులు అసలు నిండలేదు. మిగిలిన 2,962 ఎకరాల్లో ఎక్కువ భాగం మండల కేంద్రానికి దిగువ ప్రాంతంలో ఉంది. వాస్తవ పరిస్థితులు కూడా ఇందుకు అద్దం పడుతున్నాయి. జిన్నాం, కెంగువ గ్రామాల పరిధిలోనే సుమారు 500 ఎకరాల మేర నాట్లు పడలేదు. కెంగువ పరిధిలోని చాకలిబంద, మంగలి బంద, మూడు బారిక బందల కింద ఒక్క ఎకరా కూడా సాగవ్వలేదని ఆ గ్రామానికి చెందిన బూడి తవుడు ఆవేదన వ్యక్తం చేశాడు. గడిచెరువు, రామసాగరం, గంటాడ చెరువు కింద అంతంత మాత్రంగానే నాట్లుపడ్డాయి. జంగల బంద ఆయుకట్టులో అక్కడక్కడ బోర్లు ఉండడంతో పూర్తిస్థాయిలోనే నాట్లు పడ్డాయి. తుమికాపల్లిలోనూ మరో 100 ఎకరాల వరకు ఉబాలు కావాల్సివుందని వ్యవసాయ శాఖ అధికారులు చెప్పారు. ఈ ఊరికి ఆనుకునివున్న కోనేరుతో సహా కంసాలి చెరువు, జక్కోడి బంద తదితర చెరువులు నీళ్లు లేక వెలవెలబోతున్నాయి. దీంతో, తమ గ్రామ రెవెన్యూ పరిదిలోగల భూములు కొంతమేరకు ఉబాలు పట్టినప్పటికీ, జిన్నాం రెవెన్యూ పరిధిలోగల భూముల్లో ఒక్క ఎకరా కూడా అరకపట్టలేకపోయామని రైతులు వాపోయారు. ఇదే మండలంలోని చినకాద, ముచ్చెర్ల, రామన్నపేట, లింగాలవలసలో చాలా మంది రైతులు వర్షం కోసం ఎదురు చూస్తున్నారు. వర్షపునీటిని అష్టకష్టాలతో ఒడిసిపట్టి నాట్లు వేస్తే, ప్రస్తుతం పదును లేక ఎండపోతున్నాయని లోగిశ గ్రామానికి చెందిన రెల్లి రాము, పతివాడ రాము ప్రజాశక్తి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. దత్తిరాజేరు మండలంలో సుమారు వెయ్యి ఎకరాల మేర ఇంకా ఉబాలు కావాల్సివుంది. కనీసం సాగునీటి వనరులు లేకపోవడంతో గడసాం, దత్తి, చింతలవలస, పాచలవలస, జగన్నాధపురం తదితర గ్రామాల్లో నాట్లు మందకొడిగా సాగుతున్నాయి. బొండపల్లి మండలంలో సుమారు 1056 ఎకరాల్లో నాట్లు పడాల్సివుందని అధికారిక సమాచారం. ఖరీఫ్ సీజన్ ప్రారంభం నుంచీ తొణికిసలాడే నీటితో కళకలాడే నెలివాడ పెద్ద చెరువు కూడా నిండకపోవడం గమనార్హం. దీంతో, నెలివాడలో 250 ఎకరాల్లో నాట్లు పడాల్సివుండగా కేవలం 80 ఎకరాల్లో మాత్రమే నాట్లుపడ్డాయి. బిల్లలవలసలో 170 ఎకరాలకుగాను 70ఎకరాల్లోనే సాగు కనిపిస్తోంది. మునుపెన్నడూ ఇటువంటి పరిస్థితి చవిచూడలేదంటూ నెలివాడ గ్రామానికి చెందిన జి.శ్రీనివాసరావు, పైడన్న ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా దాదాపు ఎక్కువ గ్రామాల్లో సాగుభూములు ఎంతోకొంత తక్కువగానే ఉన్నాయి. మెంటాడ మండలానికి ఆండ్ర రిజర్వాయర్ సాగునీటి ప్రదాయినిగా ఉన్నప్పటికీ ఇంకా 517 ఎకరాల్లో నాట్లు పడలేదు. కేవలం గజపతినగరం సబ్ - డివిజన్ మాత్రమే కాదు. దాదాపు అన్ని డివిజన్లలోనూ ఉబాలు వెనుబాటు కనిపిస్తోంది.
జిల్లా వాప్తంగా వరి, మొక్కజొన్న, పత్తి, చెరకు, అపరాలు, చిరుధాన్యాలు తదితర పంటల సాధారణ విస్తీర్ణం 3,13,465 ఎకరాలు కాగా, ఇప్పటి వరకు కేవలం 2లక్షల ఎకరాల్లో మాత్రమే సాగు కనిపిస్తోంది. వరి సాధారణ విస్తీర్ణం 2,25,637 ఎకరాలకుగాను ఇప్పటి వరకు కేవలం 1,64,785 మాత్రమే నాట్లుపడ్డాయి. గత ఏడాది ఇదే సమయానికి సుమారు 1,75,000 ఎకరాల్లో నాట్లుపడినట్టు అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గజపతినగరం మండలంలో 8,892 ఎకరాలు సాధారణ విస్తీర్ణం కాగా, గత ఏడాది ఆగస్టు నెలాఖరు నాటికే 10వేల ఎకరాలు దాటి ఉబాలు పడ్డాయని ఎఒ ధనలక్ష్మి తెలిపారు. ఈ ఏడాది దాదాపు అన్ని మండలాల్లోనూ సాగు విస్తీర్ణం తక్కువగా కనిపిస్తోంది.
అదునుదాటి వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రెండు రోజులుగా జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. గత నెలవరకు జిల్లాలో లోటు వర్షపాతం ఉంది. ప్రస్తుతం అడపా దడపా కురుస్తున్న వర్షాలతో ఏమి చేయాలో రైతులకు దిక్కుతోచడం లేదు. అదును దాటిపోవడంతో నాట్లు వేయాలా వద్దా అనే మీమాంశలో ఉన్నారు. ఒకవేళ వేసినా దిగుబడి రాదని తెలిసి ఆవేదన చెందుతున్నారు. జిల్లాలో మంగళవారం 16.7 మి.మీ., వర్షం కురిసింది. అత్యధికంగా బొబ్బిలి, తెర్లాం, బాడంగి మండలాల్లో వర్షం కురవగా, అత్యల్పంగా గరివిడి, బొండపల్లి, జామి, విజయనగరం, పూసపాటిరేగ, నెల్లిమర్ల మండలాల్లో కురిసింది. బుధవారం కూడా పలు మండలాల్లో వర్షాలు కురిశాయి.
నాలుగెకరాలకు ఒక్క ఎకరాలోనే ఉబాలు
నాకు నాలుగు ఎకరాల భూమి ఉంది. ఇప్పటి వరకు అతికష్టంమీద ఒక ఎకరాలో మాత్రమే వరినాట్లు వేశాను. మిగిలిన భూమిలో నాట్లు వేసేందుకు వర్షం కోసం ఎదురు చూడాల్సివస్తోంది. మరోవైపు నారుపోసి రెండు నెలలు కావచ్చింది. ఇక నాటినా తగిన దిగుబడి రాదని అంటున్నారు. ఈ ఏడాది ఏం చేయాలో ఎలా బతకాలో అర్థం కావడం లేదు.
-మరడాన సన్నాసప్పడు, తుమ్మికాపల్లి. గజపతినగరం మండలం










