Aug 25,2023 21:17

అధ్వానంగా తయారైన గ్రోత్‌సెంటర్‌ రహదారి

ప్రజాశక్తి-బొబ్బిలి :  బొబ్బిలి గ్రోత్‌సెంటర్లో రోడ్లు భయంకరంగా మారాయి. మొదట, రెండో విడత లేఅవుట్లలో రోడ్లన్నీ గోతులమయంగా మారాయి. దీంతో కార్మికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రోత్‌సెంటర్లో మౌలిక సౌకర్యాలు కల్పించాల్సిన ప్రభుత్వం పట్టించుకోక పోవడంతో పారిశ్రామికవాడ అభివృద్ధికి దూరంగా ఉంది. మౌలిక సౌకర్యాలు లేకపోవడంతో పరిశ్రమలు స్థాపించేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావడం లేదు.
గ్రోత్‌సెంటర్‌ రెండో విడత లేఅవుట్‌లో రోడ్లన్నీ గోతులమయంగా మారాయి. రోడ్లపై పెద్డపెద్ద గొయ్యిలు ఏర్పడటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెండో విడత లేఅవుట్‌లో పెద్ద పరిశ్రమలు బెర్రీ, ఇంపెక్స్‌, హిరా, అరోరా, సిరి, సహారా, యోన, విక్టోరియా ఫెర్రో ఎల్లాయీస్‌ పరిశ్రమలతోపాటు హెరిటేజ్‌ మిల్క్‌ డెయిరీ ఉంది. ఆయా పరిశ్రమలకు రోజుకు వందల సంఖ్యల లారీలు రాకపోకలు సాగిస్తున్నాయి. రోడ్లు గోతులమయంగా ఉండడంతో వాహనాలు తరచూ మరమ్మతులకు గురవుతున్నాయని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిశ్రమలకు ముడి సరుకు తేవాలన్నా, పరిశ్రమలలో ఉత్పత్తి చేసే సరుకు తీసుకెళ్లాలన్నా నరకం చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి రోడ్లు బాగు చేయాలని పారిశ్రామిక వేత్తలు, వాహనదారులు కోరుచున్నారు.
డ్యూటీలకు వెళ్లాలంటే నరకమే
గ్రోత్‌సెంటర్‌ పరిశ్రమలకు డ్యూటీలకు వెళ్లాలంటే నరకం అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని కార్మికులు వాపోతున్నారు. ఇంపెక్స్‌ పక్క నుంచి ఉన్న రహదారి, సిరి పరిశ్రమ మీదుగా ఉన్న రహదారి పూర్తిగా పాడైపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని కార్మికులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఎపిఐఐసి అధికారులు స్పందించి రోడ్లు వేయాలని కార్మికులు కోరుతున్నారు.
ఆదాయం కోట్లలో...
గ్రోత్‌ సెంటర్‌లో ఉన్న పరిశ్రమల నుంచి ప్రభుత్వానికి ఆదాయం కోట్లలో వస్తున్నప్పటికీ రోడ్లు, సెంటర్‌ లైటింగ్‌ నిర్వహణ బాధ్యత పట్టించుకోవడం లేదని పారిశ్రామికవేత్తలు వాపోతున్నారు. ప్రతి ఏడాది రూ.కోట్లలో వివిధ పన్నుల రూపంలో చెల్లిస్తున్నా కనీస సౌకర్యాలు కల్పించకపోవడం అన్యాయమని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి రోడ్లు, సెంటర్‌ లైటింగ్‌ నిర్వహణ చూడాలని పారిశ్రామిక వేత్తలు కోరుతున్నారు.
ముందుకు రాని భారీ పరిశ్రమలు
గ్రోత్‌ సెంటర్‌లో కనీస సౌకర్యాలు కల్పించకపోవడంతో పరిశ్రమలను స్థాపించేందుకు పారిశ్రామిక వేత్తలు ముందుకు రావడం లేదు. వైజాగ్‌ ప్రొఫైల్‌, మొయిలీ ఫెర్రో పరిశ్రమలకు స్థలం కేటాయించినా పనులు ప్రారంభించలేదు. బికె స్టీల్‌ పరిశ్రమ పూర్తిగా కంపెనీ స్థాపించకుండా స్థలాన్ని వెనక్కి ఇచ్చేసింది. మౌలిక సదుపాయాలు లేకపోవడం వల్లే పరిశ్రమల స్థాపనకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావడం లేదు. ప్రభుత్వం స్పందించి మౌలిక సౌకర్యాలు కల్పించాలని పలువురు కోరుతున్నారు.
సొంతంగా గోతులను పూడ్చుకుంటున్న పారిశ్రామికవేత్తలు
గ్రోత్‌సెంటర్లో పాడైపోయిన రోడ్లను గ్రావెల్‌, ఫెర్రో వ్యర్థాలతో పూడ్చుతున్నారు. పరిశ్రమలకు నిత్యం ముడిసరుకు తెస్తున్న లారీలు, పరిశ్రమల నుంచి ఉత్పత్తులను తరలిస్తున్న వాహనాలు గోతుల్లో కూరుకుపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రోత్‌సెంటర్‌కు వాహనదారులు, డ్రైవర్లు భయపడి రాలేమని చెప్పడంతో ఫెర్రో పరిశ్రమల యాజమాన్యాలు ఫెర్రో వ్యర్థాలతో రోడ్లపై గోతులను కప్పి, తాత్కాలిక మరమ్మతులు చేస్తున్నారు. ఇప్పటికైనా ఎపిఐఐసి అధికారులు స్పందించి రోడ్లు బాగు చేయాలని పారిశ్రామిక వేత్తలు, కార్మికులు కోరుతున్నారు.