ప్రజాశక్తి- గరివిడి : స్థానిక అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజనీరింగ్ కాలేజీలో శనివారం ఆంధ్రప్రదేశ్ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, కాలేజీ యన్‌ఎస్‌ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో ర్యాగింగ్ నిరోధకతపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జూనియర్ సివిల్ జడ్జ్, చీపురపల్లి లీగల్ సర్వీసెస్ కమిటీ మండల చైర్‌పర్సన్ ఎమ్.విజయ రామేశ్వరి పాల్గొని మాట్లాడారు. సీనియర్స్, జూనియర్ విద్యార్థుల పట్ల స్నేహ పూర్వకం వాతావరణం ఉండాలన్నారు. విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడితే జరిగే నష్టాలు వివరిస్తూ, ఏపి ప్రొహిబిషన్ ర్యాగింగ్ యాక్ట్ -1997 వంటి చట్టాల ద్వారా కనీసం 6 నెలలు నుండి జీవితాంతం జైలుశిక్ష పడే అవకాశం ఉందన్నారు. ఒక విద్యార్థికి ర్యాగింగ్ ద్వారా జైలు శిక్ష పడినట్లయితే ఆ విద్యార్థిని కాలేజీ నుంచి బహిష్కరించడమే కాకుండా, మరి ఏ కాలేజీలో కూడా అడ్మిషన్ పొందలేరన్నారు. మహిళల రక్షణ కోసం ఉన్న చట్టాలతో పాటు ర్యాగింగ్ చట్టాలపై విద్యార్థులకు వివరిస్తూ, కేసుల్లో ఇరుక్కొని జీవితాలు నాశనం చేసుకోవద్దుని సూచించారు. విద్యార్థులు క్రమశిక్షణ, సమాజం పట్ల బాధ్యతతో చదువుకొని ఉన్నత శిఖరాలను చేరుకోవాలన్నారు. గరివిడి ఎస్‌ఐ ఎల్.దామోదరరావు మాట్లాడుతూ యూట్యూబ్, ఫేసుబుక్, ఇన్‌స్ట్రా గ్రామ్, టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా యాప్స్ ద్వారా మోసాల భారినపడి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు అని సూచించారు. ప్రస్తుత సమాజంలో ప్రభుత్వ ఉద్యోగంతో పాటు, ప్రైవేటు ఉద్యో గానికి కూడా పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికెట్ చాలా ముఖ్యమని తెలిపారు. ప్రిన్సిపల్ డాక్టర్ వి. జాషువ జయప్రసాద్ మాట్లాడుతూ కాలేజీలో ర్యాగింగ్ నిరోధానికి అనేక చర్యలు చేపట్టామన్నారు. విద్యార్థులు, అధ్యాపకులతో కమిటీలు వేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ర్యాగింగ్ రహిత కళాశాలగా తీర్చిదిద్దుకుంటున్నామన్నారు. విద్యార్థులకు హెల్ప్‌లైన్ నెంబర్లు అందుబాటులో ఉంచామన్నారు. ఈ కార్యక్రమంలో లోక్‌అదాలత్ మెంబర్ బి.శ్రీదేవి, న్యాయవాదులు డి.రఘుపతి నాయుడు, కె.త్రినాధ రావు, వైస్ ప్రిన్సిపాల్ బి.వెంకటరమణ, ఎఒ జి.అనిల్ కుమార్, యన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ ఎస్.సత్యం, వాలంటీర్స్, విద్యార్థులు పాల్గొన్నారు.










