Sep 07,2023 21:02

ధర్నా చేస్తున్న సిఐటియు నాయకులు, ఆటో డ్రైవర్లు

ప్రజాశక్తి- గంట్యాడ : ఆటో డ్రైవర్లపై పెడుతున్న కేసులను రద్దు చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కాకి సురేష్‌ డిమాండ్‌ చేశారు. జిల్లా ఆటో వర్కర్స్‌ యూనియన్‌ (సిఐటియు అనుబంధం) ఆధ్వర్యంలో లక్కిడాం జంక్షన్‌ నుంచి తహశీల్దార్‌ కార్యాలయం వరకూ ఆటో డ్రైవర్లు ర్యాలీగా వెళ్లి గురువారం ధర్నా నిర్వహించారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని తహశీల్దార్‌కు అందించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి సురేష్‌, జిల్లా కార్యదర్శి ఏ జగన్మోహన్‌రావు, గంట్యాడ ఆటో యూనియన్‌ నాయకులు వి. సత్యారావు మాట్లాడుతూ పెట్రోల్‌ డీజిల్‌ ధరలు పెరుగుదలతో ఇబ్బంది పడుతున్నామని, స్థానికంగా పోలీసులు నెలనెలా పెట్టి కేసులతో మరిన్ని కష్టాలు పడుతున్నామని చెప్పారు. రేయింబవళ్లుప్రజలకు సర్వీస్‌ అందిస్తున్నామని తమను ముద్దాయిలు గాను, దోషులుగాను చిత్రీకరించొద్దని అక్రమ కేసులతో ఇబ్బంది పెట్టవద్దని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం పెంచిన ఫీజులు, పెనాల్టీల జీవో 21 రద్దు చేయాలని, మోటార్‌ వాహన చట్టం 2020లో డ్రైవర్ల మెడకు ఉరితాడు బిగించే కొన్నింటిని సవరించాలని, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, ఇఎస్‌ఐ, పిఎఫ్‌ అమలు, ఈ చలానాల రద్దు, ఆటోలకు పార్కింగ్‌ స్థలాలు, డ్రైవర్లకు గుర్తింపు కార్డులు తదితర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం గంట్యాడ పోలీస్‌ స్టేషన్‌లో హెడ్‌ కానిస్టేబుల్‌కు వినతిపత్రం ఇచ్చారు. ఈ ధర్నాలో ఆటో యూనియన్‌ నాయకులు బంగారు నాయుడు, శ్రీను, వెంకటరావు, సన్యాసినాయుడు, తదితరులు పాల్గొన్నారు.