ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా ఆటో వర్కర్స్ యూనియన్ (సిఐటి యు) ఆధ్వర్యంలో విజయనగరం, దత్తిరాజేరు మండలం మానాపురం, ఎస్.కోటలో మంగళవారం ఆందోళనలు చేపట్టారు. కోట జంక్షన్ వద్ద జరిగిన రాస్తారోకోలో సిఐటియు నగర అధ్యక్ష ,కార్యదర్శులు ఎ. జగన్మోహన్‌రావు, బి. రమణ మాట్లాడుతూ నిరంతరం పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం పెంచిన అధిక ఫీజులు, పెనాల్టీలతో డ్రైవర్లంతా ఇబ్బంది పడుతున్నారని అన్నారు. రవాణా రంగాన్ని కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టేందుకు మోడీ మోటారు వాహన చట్టం -2020 లో సవరణలు చేశారని, వీటి రద్దు కోసం దేశవ్యాప్త ఆందోళనకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అందులో భాగంగా సెప్టెంబర్ 16, 17 తేదీల్లో రాష్ట్ర వర్క్ షాప్ కర్నూల్లో నిర్వహిస్తున్నామని, అక్టోబర్ 6న చలో రాజభవన్ ఉంటుందని తెలిపారు. ఆటోలకు పార్కింగ్ స్థలాలు కేటాయించాలని, ఎస్‌సి, ఎస్‌టి,బిసి, మైనార్టీ కార్పొరేషన్‌ల ద్వారా సబ్సిడీపై రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమానికి బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులకు కంది త్రినాద్ మద్దతు తెలిపారు. లక్ష్మణ్ దొర, రాము, నర్సింగ్, ప్రసాద్,శ్రీను, రామారావు, సురేషు, తిరుపతిరావు, భాస్కర్ రావు, తదితర ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.
దత్తిరాజేరు : ఆటో కార్మికులు సిఐటియు ఆధ్వర్యంలో గర్భాం రోడ్డు జంక్షన్లో రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా ఆటో యూనియన్ అధ్యక్షులు బి అప్పలనాయుడు, సిఐటియు నాయకులు జి.శ్రీనివాస్ మాట్లాడుతూ నిరంతరం పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం పెంచిన అధిక ఫీజులు, పెనాల్టీలతో డ్రైవర్లంతా ఇబ్బంది పడుతున్నారని అన్నారు. రవాణా రంగాన్ని కార్పోరేట్ కంపెనీలకు కట్టబెట్టేందుకు మోడీ మోటర్ వాహన చట్టం 2020లో సవరణ చేశారని అన్నారు. వీటి రద్దు కోసం దేశవ్యాప్తంగా ఆటో వర్కర్స్ అందరూ ఆందోళనకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. . రాష్ట్ర ప్రభుత్వం పెంచిన ఫీజులు, పెనాల్టీ జీవో నెంబర్ 21 ను రద్దు చేయాలని, ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో డి గౌరీస్, యు అప్పల రాము, టి హరీష్, ఎల్ రాము, ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
శృంగవరపుకోట : ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు చెలికాని ముత్యాలు, రావాడ సన్యాసిదేవుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తహశీల్దార్ కార్యాలయం వద్ద ఆటో కార్మికులు ధర్నా నిర్వహించారు. అనంతరం తహశీల్దార్ శ్రీనివాస్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుద్యోగ యువకులు స్వయం శక్తితో బతకాలని నిశ్చయించుకుని ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీల వద్ద లోన్లు తీసుకొని ఆటోలు నడపుకుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉక్కు పాదం మోపుతున్నాయన్నారు.కార్యక్రమంలో సూర్య, రమణ, సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.










