Aug 22,2023 21:17

అసైన్డ్‌ భూమి

ప్రజాశక్తి - విజయనగరం ప్రతినిధి :  అసైన్డ్‌ భూముల రెగ్యులైజేషన్‌కు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రెవెన్యూ యంత్రాంగం భూ సేకరణలో నిమగమైంది. మెజార్టీ భూములు పెత్తందారులు, ఆక్రమణ దారుల చెరలో ఉండడంతో ఆ భూములు తమ వశమౌతాయా? అన్న ఆశ, నిరాశలతో దళితులు ఉన్నారు. 20ఏళ్ల క్రితం నుంచి సాగులోవున్న అసైన్డ్‌ భూములను దళితులకు రెగ్యులర్‌ చేస్తామంటూ ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశం ప్రకటించిన విషయం విధితమే. ఈనేపథ్యంలో జిల్లాలో భూముల వివరాలు సేకరించే పనిలో రెవెన్యూ యంత్రాంగం ఉంది. ముఖ్యంగా విఆర్‌ఒ, ఆర్‌ఐ స్థాయిలో గ్రామాల వారీగా అసైన్డ్‌ భూమి సాగుదారులు, వారికి ఏ సంవత్సరంలో ప్రభుత్వం అప్పగించింది. అందులోనూ 2003కు మునుపు ఇచ్చిన భూమి ఎంత? అసైన్డ్‌ పట్టాదారులే సాగు చేస్తున్నారా? లేక వారి వారసులు సాగు చేస్తున్నారా? అప్పట్లో ఇచ్చిన భూమంతా వీరిచేతిలోనే ఉందా? లేక ఇతరులెవరైనా సాగుచేస్తున్నారా? అన్న కోణంలో భూమి వివరాలు సేకరిస్తున్నామని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. విజయనగరం జిల్లాలో ఇప్పటి వరకు 55వేల నుంచి 60వేల ఎకరాలు వరకు అసైన్డ్‌ భూములు ఉన్నాయని అధికారులు అంచనాగా చెబుతున్నారు.
బొబ్బిలి రెవెన్యూ డివిజన్లో 2004కు ముందు సుమారు 15,837 మంది దళితులకు 15,258.82 ఎకరాలు ఇచ్చినట్టు రెవెన్యూ రికార్డులు చెపుతున్నాయి. బాడంగి మండలంలో 2905 దళిత కుటుంబాలకు 2772.18 ఎకరాలు, బొబ్బిలిలో 3590 కుటుంబాలకు 4113 ఎకరాలు, మెంటాడలో 175 కుటుంబాలకు 411.99 ఎకరాలు, తెర్లాంలో 3394 కుటుంబాలకు 2246.54 ఎకరాలు, రామభద్రపురంలో 2220 కుటుంబాలకు 2762.10 ఎకరాలు, దత్తిరాజేరులో 1269 కుటుంబాలకు 1278.66 ఎకరాలు, గజపతినగరంలో 2286 కుటుంబాలకు 1674.27 ఎకరాలు చొప్పున అసైన్డ్‌ భూమి ప్రభుత్వం ఇచ్చింది. విజయనగరం, చీపురుపల్లి డివిజన్ల పరిధిలో కూడా ఇదే స్థాయిలో అసైన్డ్‌ భూములు ఉన్నాయి. దాదాపు ఈ భూముల్లో ఎక్కువ భాగం స్థానిక పెత్తందారులు, రాజకీయ నాయకులు, కొంతమంది ప్రజాప్రతినిధుల చేతుల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో వీరి ప్రయోజనాల కోసమే ప్రభుత్వం భూములను క్రమబద్ధీకరించేందుకు ప్రయత్నిస్తోందని కొంతమంది వాదన. ఇందుకు తగ్గట్టే బొబ్బిలి, వేపాడ, మెంటాడ తదితర మండలాల్లోని అసైన్డ్‌ భూములు చాలా కాలం క్రితం వశపర్చుకున్న పెత్తందారులు, రాజకీయ నాయకులు దళితులను మచ్చిక చేసుకుంటున్నారు. అప్పట్లో డబ్బులు ఇచ్చి కొనుక్కున నేపథ్యంలో భూములు రెగ్యులర్‌ కాగానే తమ పేరున రిజిస్ట్రేషన్‌ చేసేందుకు సిద్ధంగా ఉండాలని, అవసరమైతే ఎంతో కొంత ఇచ్చేస్తామని అదిరింపులు, బెదిరింపులు, బుజ్జగింపులు చేస్తున్నారు. వెనుకాడితే అప్పట్లో రాసుకున్న తెల్లకాగితాలు, బాండ్‌పేపర్లను బయటకు తీస్తామంటూ హెచ్చరిస్తున్నారు.