ప్రజాశక్తి-డుంబ్రిగూడ: పంచాయితీ పరిధిలోనున్న ఆర్థిక వనరులపై దృష్టి సారించేందుకు స్థానిక పంచాయతీ అధికారులు ప్రణాళికను రూపొందించుకోవాలని జెడ్పి సీఈవో పి.రామమూర్తి అధికారులకు సూచించారు. మండలంలోని పోతంగి, అరుకు సచివాలయ కేంద్రాలను బుధవారం ఆయన సందర్శించి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా పంచాయతీకి సమకూరుస్తున్న ఆర్థిక వనరులపై ఆయన పంచాయతీ సిబ్బందితో అడిగి తెలుసుకున్నారు. ఇంటి పన్నును సకాలంలో వసూలు చేయడంతో పాటు, వ్యాపారపరంగా నూతనంగా నిర్మిస్తున్న షాపింగ్ నిర్మాణాలపై కూడా పంచాయతీ పరిధిలో అధికారులు తీర్మానం చేసి ట్యాక్స్ వసూలు చేసుకోవాలన్నారు. పంచాయతీ కేంద్రాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవడానికి అవసరమైన చోట డస్ట్ బిన్ లు ఏర్పాటు చేసి స్థానికులు ఉపయోగించిన చెత్తచెదారాన్ని డస్ట్ బిన్లు పడేసే విధంగా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. చెత్తా చెదారాన్ని తొలగించేందుకు యూజర్ చార్జీలు వసూలు చేస్తున్నట్లు ప్రజలకు చెప్పాలన్నారు. పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు చెల్లించాలంటే తప్పనిసరిగా ఇంటి పన్నులు వసూలు చేసుకోవాలని పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. పంచాయతీ సిబ్బంది కార్యాలయానికి పరిమితం కాకుండా పంచాయతీ పరిధిలోని ఉన్న ప్రభుత్వ అస్తులతోపాటు ఇతర రకాలుగా ఆదాయం సమకూరే వాటిపై దృష్టి సారించి వసూలు చేసుకోవాలని చెప్పారు. పన్నులు, యూజర్ చార్జీలు వసూలు చేసేటప్పుడు ముందుగా ప్రజల్లో నుంచి వ్యతిరేకత రాకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహించి వారికి అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో నగేష్, ఈవోపీఆర్డి, ఏపీవో దొరబాబు, పంచాయతీ కార్యదర్శులు విజరు, బాలకృష్ణ, వీఆర్పీ సంతకుమారి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.










