Sep 05,2023 21:43

పింఛన్లను పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే, ఎంపి

ప్రజాశక్తి- డెంకాడ : పేదల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని విజయనగరం ఎంపి బెల్లాన చంద్రశేఖర రావు, నెల్లిమర్ల ఎమ్మెల్యే బడ్డు కొండ అప్పలనాయుడు తెలిపారు. మండలంలో జొన్నాడలో రైతు భరోసా కేంద్రాన్ని మంగళవారం వారు ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ కులమత రాజకీయాలకతీతంగా ప్రతి ఒక్కరికి పథకాల అందజేస్తున్నామన్నారు. ప్రజలు వాటిని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. దేశంలో అన్ని రాష్ట్రాలు ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తున్నాయని తెలిపారు. ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ అధికారంలోనికి రావడం కల అని వారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రారని జోష్యం పలికారు. అనంతరం అంగన్వాడి కార్యకర్తలు ఏర్పాటు చేసిన పౌష్టికాహారాలను పరిశీలించి వారికి ప్రభుత్వం అందజేసిన రెండు జతల బట్టలను పంపిణీ చేశారు. గర్భిణులకు పౌష్టికాహారాన్ని అందించారు. అంగన్వాడి పిల్లలకు పుస్తకాలు పంపిణీ చేశారు. అనంతరం నూతనంగా మంజూరైన 400 పింఛన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అంగన్వాడి కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎమ్మెల్యే ఎంపిలకు అంగన్వాడీ కార్యకర్తల నాయకురాలు కృష్ణ వినతి పత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ డాక్టర్‌ పిసురేష్‌ బాబు, నియోజవర్గంలోని నాలుగు మండలాల ఎంపిపిలు, జెడ్‌పిటిసిలు, పార్టీ మండల అధ్యక్షులు, మున్సిపాలిటీ చైర్మన్లు వైస్‌ ఎంపిపిలు, వైస్‌ చైర్మన్లు, వివిధ రాష్ట్ర డైరెక్టర్లు, ఆకులపేట సర్పంచ్‌ కోరాడ రమణి, కోటి నాయుడు, రమేష్‌, ఎంపిటిసి దేవి మురళీ పాల్గొన్నారు.
వార్డెన్లతో సమీక్షా సమావేశం
నియోజకవర్గంలో ఉన్న ఎస్‌సి, ఎస్‌టి బిసి వసతి గృహల అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే అన్నారు. మండలంలోని జొన్నాడలో హాస్టల్‌ వార్డెన్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో 15 హాస్టళ్లు ఉండేవని ప్రస్తుతం 13 హాస్టళ్లు పనిచేస్తున్నాయన్నారు. కోనాడ హాస్టల్‌ను గతంలో మూసి వేశారని దానిని పునరుద్ధరించాలని అసిస్టెంట్‌ బిసి సోషల్‌ వెల్ఫేర్‌ అధికారిని రాజులమ్మను ఆదేశించారు. ఈ సమావేశంలో ఎంపి బెల్లాన చంద్రశేఖరరావు, ఎమ్మెల్సీ డాక్టర్‌ పి. సురేష్‌ బాబు, నాలుగు మండలాల ఎంపిపిలు, జెడ్‌పిటిసిలు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే పాన్‌ కార్డు ట్యాంపరింగ్‌
నెల్లిమర్ల ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు పాన్‌ కార్డును టిడిపి నాయకుడు ట్యాంపరింగ్‌ చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. తన స్వగ్రామం మోపాడుకు చెందిన టిడిపి మాజీ ఎంపిటిసి బంటుపల్లి మురళీధర్‌రావు తన పాన్‌ కార్డును ట్యాంపరింగ్‌ చేశాడని అన్నారు. తన పాన్‌ కార్డు ద్వారా కారు కొనుగోలు చేశాడని చెప్పారు. పాన్‌ కార్డు ఫోటో టిడిపి నాయకుడు మురళీదని అందులో నెంబర్‌ మాత్రం తన పాన్‌ కార్డు నెంబరు ఏర్పాటు చేసి వాడుకుంటున్నాడని ఆరోపించారు. ఆడిట్‌లో ఈ విషయం బయటపడిందని తెలిపారు. దీనిపై స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశామని స్పష్టం చేశారు.
జల జీవన్‌ మిషన్‌ పనులు ప్రారంభం
నెల్లిమర్ల: మండలంలోని మొయిద విజయరాంపురంలో జలజీవన్‌ మిషన్‌ పనులకు మంగళ వారం ఎమ్మెల్సీ డాక్టర్‌ పివివి సూర్య నారాయణ రాజు, ఎమ్మెల్యే బడ్డు కొండ అప్పల నాయుడు, శంకు స్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జల జీవన్‌ మిషన్‌ ద్వారా ఇంటింటికి కుళాయి ఏర్పాటు చేసి తాగునీటిని అందిస్తామన్నారు. మొయిద విజయరాం పురంలో 550 గృహాలకు ఇంటింటికీ తాగు నీరు సరఫరా చేయడం జరుగుతుందన్నారు. అనంతరం జిల్లా పరిషత్‌ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు జన్మదినం సందర్భంగా వైసిపి నాయకులు, అభిమానులతో కలిసి కేక్‌ కట్‌ చేసి మజ్జి శ్రీనివాసరావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలపారు. ఈ కార్యక్రమంలో జడ్‌పిటిసి గదల సన్యాసి నాయుడు, రాష్ట్ర టూరిజం కార్పొరేషన్‌ డైరెక్టర్‌ రేగాన శ్రీనివాసరావు, నగర పంచాయతీ వైసిపి అధ్యక్షులు చిక్కాల సాంబశివరావు, వైస్‌ ఎంపిపి పతివాడ సత్య నారాయణ, మొయిద పిఎసిఎస్‌ చైర్మన్‌ అట్టాడ కనకారావు స్థానిక సర్పంచ్‌ అట్టాడ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.