ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : అర్హతే ప్రామాణికంగా ప్రజలకు అవసరమైన అన్ని పథకాలను రాష్ట్ర ప్రభుత్వం వర్తింప చేస్తోందని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి పునరుద్ఘాటించారు. గురువారం నూతనంగా మంజూరైన తెల్ల రేషన్ కార్డులను లబ్ధిదారులకు అందజేశారు. స్థానిక కంటోన్మెంట్ ప్రాంతంలో ఉన్న ప్రాథమికోన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 805 మందికి రేషన్ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు పొందడానికి రేషన్ కార్డు కీలకమని అన్నారు. అందువల్ల అర్హత ఉండి రేషన్ కార్డు పొందలేని వారికి వారి వివరాలను ప్రత్యేకంగా సేకరించి కార్డులు మంజూరయ్యే విధంగా చొరవ చూపామన్నారు. కార్యక్రమంలో మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ లయ యాదవ్, సహాయ కమిషనర్ ప్రసాదరావు, జోనల్ ఇన్చార్జ్ డాక్టర్ వి ఎస్ ప్రసాద్, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు పాల్గొన్నారు.
గడపగడపకూ సమస్యలపై ఆరా తీస్తూ
27వ డివిజన్ స్టేడియం పేటలో జరిగిన గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో డిప్యూటి స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి పాల్గొన్నారు. ప్రతి ఇంటికీ వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను చదివి వినిపించారు. స్థానికంగా ఉన్న సమస్యలపై ఆరా తీశారు. పలు చోట్ల విద్యుత్ సంబంధిత సమస్యలను స్థానికులు తెలిపారు. సామూహిక మరుగుదొడ్లు కావాలని, కుళాయిలు కావాలని కొంతమంది కోరారు. ప్రాధాన్యత పరంగా రోజుల వ్యవధిలోనే సమస్యలను పరిష్కరిస్తామని కోలగట్ల భరోసా ఇచ్చారు. వెంటనే సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు ఇచ్చారు. కార్యక్రమంలో నగర మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ లయ యాదవ్, సహాయ కమిషనర్ ప్రసాదరావు, స్థానిక కార్పొరేటర్ దుప్పాడ సునీత తదితరులు పాల్గొన్నారు.










