Aug 22,2023 20:42

విద్యుత్తు సిబ్బందికి వినతి పత్రాన్ని అందిస్తున్న వామపక్ష నాయకులు

ప్రజాశక్తి - నెల్లిమర్ల : ప్రభుత్వం అప్రకటిత విద్యుత్‌ కోతలు నివారించాలని వామ పక్ష నాయకులు డిమాండ్‌ చేశారు. మంగళవారం అప్రకటిత విద్యుత్‌ కోతలను వ్యతిరేకిస్తూ సిపిఎం, సిపిఐ, న్యూడెమోక్రసీ ఆద్వర్యంలో స్థానిక విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ వద్ద వినియోగ దారులు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వామ పక్ష నేతలు మాట్లడుతూ ప్రభుత్వం అప్రకటిత విద్యుత్‌ కోతలు అమలు చేసి సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం దారుణమన్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో ముందస్తు సమాచారం లేకుండా 3గంటలకు పైగా విద్యుత్‌ కోతలు అమలు చేయడం భావ్యం కాదన్నారు. కోతలు గురించి వినియోగ దారులు అడిగితే ఎప్పుడు విద్యుత్‌ వస్తుందో తెలీదని చెబుతున్నారని తెలిపారు. గృహ వినియోగదారుల నుంచి యూనిట్‌కి ఒక రూపాయ నుంచి రెండు రూపాయలకు పైగా విద్యుత్‌ బిల్లులు అదనపు ఛార్జీల పేరిట భారీగా వసూళ్లు చేస్తున్న ప్రభుత్వం నాణ్యమైన అంతరాయం లేని విద్యుత్‌ సరఫరా చేయాల్సిన బాధ్యత లేదా అని ప్రశ్నించారు. రాత్రి వేళల్లో అనధికార విద్యుత్‌ కోతలు అమలు చేయడం వల్ల వృద్దులు, చిన్న పిల్లలు, రోగులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పగటి పూట విద్యుత్‌ ఎప్పుడూ ఉంటుందో తెలియదని ప్రస్తుతం వరి నాట్లు జరిగి సాగు నీటి కోసం మోటార్‌ వేసి ఇంటికి వెళ్లిన రైతుకి తిరిగి వచ్చేసరికి మోటారు ఆగిపోయే పరిస్థితి ఎదురవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అనధికార విద్యుత్‌ కోతలు నివారించకపోతే సబ్‌ స్టేషన్‌ ముట్టడిస్తామని హెచ్చరించారు. అనంతరం సబ్‌ స్టేషన్‌ సిబ్బందికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వామ పక్షాల నేతలు కిల్లంపల్లి రామారావు, తాలాడ సన్ని బాబు, మొయిద పాపారావు, కాళ్ళ అప్పల రాజు తదితరులు పాల్గొన్నన్నారు.