ప్రజాశక్తి- మెంటాడ: మండలంలోని లోతుగెడ్డ గ్రామానికి చెందిన ఎలిగాపు నాగరాజు(22) అనుమానస్పద స్థితిలో మృతి చెందాడు. ఆండ్ర జలాశయంలో ఆదివారం నాగరాజు మృతదేహం లభ్యమైంది. కుటుంబ సభ్యులు, పోలీసులు వివరాలు ప్రకారం.. నాగరాజు జెసిబి ఆపరేటర్‌గా విశాఖలో పరిసర ప్రాంతాలలో పనిచేస్తున్నాడు. కొద్ది రోజులు క్రితం లోతుగెడ్డ స్వగ్రామం వచ్చాడు. శనివారం ఉదయం 6గంటల సమయంలో స్నేహితులతో కలిసి కాలకృత్యాలు తీర్చుకొనేందుకు ఆండ్ర జలాశయం వైపునకు వెళ్లాడు. ఎంతకీ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతికారు. జలాశయం గట్టుపై నాగరాజు బట్టలు, చెప్పులు వుండడం గమనించిన నాగరాజు తల్లి రామలక్ష్మి ఆండ్ర పోలీసులకు శనివారం ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. కాగా ఆదివారం నాగరాజు మృత దేహం ఆండ్ర జలాశయంలో లభ్యమైంది. నాగరాజు చిన్నతనంలోనే తండ్రి అప్పలస్వామి మృతి చెందాడు.
నాగరాజు ఒక్కడే సంతానం
నాగరాజు తండ్రి అప్పలస్వామి చిన్న తనంలోనే చనిపోయినా కొడుకులో భర్తను చూసుకుంటూ బతుకుతున్నాని తల్లి రామలక్ష్మి బోరున విలపిస్తుంది. ఒక్కగానొక్క కొడుకు అనుమానాస్పదంగా మృతి చెందడంతో ఆమె కన్నీటి పర్యంతమవుతోంది. అసలు నాగరాజు ఎలా చనిపోయాడన్న అనుమానాలు వ్యక్తమవుతు న్నాయి. స్నేహితులతో కలసి జలాశయానికి చేపలు వేటకు వెళ్లారని స్థానికులు చెబుతున్నారు. అయితే నాగరాజు వాళ్ళతో చేపలు వేటకు వెళ్ళాడా లేదా అన్నది స్పష్టత లేదు. కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లిన నాగరాజు బట్టలు, చెప్పులు జలాశయం గట్టుపై ఎందుకు ఉన్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్నేహితులతో కలిసి చేపల వేటకు వెళ్లి ప్రమాదానికి గురయ్యాడా? స్నేహితుల మధ్య గొడవేమైనా జరిగిందా? ఈతకు దిగి మృతి చెందాడా? లేదా ఆత్మహత్యకు పాల్పడ్డాడా అని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గజపతినగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు..










