ప్రజాశక్తి - కొత్తవలస, చీపురుపల్లి : కొత్తవలస, చీపురుపల్లి మండల కేంద్రాల్లోని రవీంద్ర భారతి పాఠశాలలో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు గురువారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. చిట్టి కన్నయ్యలు, చిన్నారి గోపికలు వేషధారణలతో విద్యార్థులు సందడి చేశారు. పాఠశాల ఆవరణ అంతటా బృందావనాన్ని మైమరిపించేలా అలంకరిం చారు. పాఠశాలలో ఉట్టిమహౌత్సవంలో భాగంగా ఉట్టిని కొట్టేందుకు పాఠశాల చిన్నారులు ఎంతో పోటీపడ్డారు. ఈ సందర్బంగా రవీంద్రభారతి పాఠశాలల చైర్మన్ యంఎస్ మణి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపారు. భాగవతం మన సంస్కృతి, సాంప్రదాయాల ద్వారా విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికి తీయడానికి ఈ వేడుకలు అద్దం పడతాయని ఉత్తరాంధ్ర రవీంద్రభారతి పాఠశాలల ఇంచార్జి ఎన్.వెంకటేష్ తెలిపారు. విద్యార్థులు నిర్వహించిన పలు సాంస్కతిక కార్యక్రమాలతో పాటు శ్రీకృష్ణుని చెరసాలలో జననం అనే నాటక ఘట్టం, శ్రీకృష్ణుని బాల్య క్రీడలు ఎంతో కనువిందు చేసాయి. విజయనగరం టౌన్: నగరంలోని మున్నా మైఖేల్ డాన్స్ అకాడమీలో శ్రీకష్ణ జన్మాష్టమి వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అకాడమీ డైరెక్టర్ మున్నా మాట్లాడుతూ తమ అకాడమీలో ప్రతి ఏడాది ముద్దుల కష్ణయ్యలు, మురిపాల గోపెమ్మలు కాన్సెప్ట్ తో పిల్లలను అలంకరింపజేసి బాల గోకులం పోటీలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. మెరక ముడిదాం: మండలంలోని పలు గ్రామాలలో గురువారం కృష్ణాష్టమి వేడుకలు సందడిగా జరిగాయి. బైరిపురంలో శ్రీకృష్ణ దేవాలయం, శ్రీ వేంకటేశ్వర ఆలయ ప్రాంగణంలో ఈ వేడక సందర్భంగా ఉట్టు కొట్టే కార్యక్రమంలో యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జూనియర్ విభాగంలో భాలికలు కూడా ఇందులో పాల్గొన్నారు. గ్రామ సర్పంచ్ పప్పల విజయకుమారి, ఉపసర్పంచ్ పప్పల క్రిష్ణ మూర్తి, వైస్ ఎంపిపి కందుల పార్వతి, ప్రధానోపాధ్యాయులు ఎస్‌ఎస్‌ఆర్ ఆచార్యులు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విజేతులకు సీనియర్, జూనియర్ విభాగాలకు గాను ఇరువై బహుమతులను అందచేశారు. నెల్లిమర్ల: నగర పంచాయతి పరిధిలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. జరజాపుపేట, స్థానిక తెలకల వీధిలో కాలనీ వాసులు ఈ వేడుకలను వైభవంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా జరజాపుపేట నాయుడు వీధిలో యువత ఉట్టి కార్యక్రమం నిర్వహించి విజేతలకు బహుతులు అందజే శారు. అనంతరం చిన్నారులు గోపికల వేషధారణలో అలరించి ఆకట్టుకున్నారు.










