ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చింతలవలస ఎంవిజిఆర్ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో పది రోజులుగా జరుగుతున్న అండర్ 16 అంతర్ జిల్లాల క్రికెట్ టోర్నీ విజేతగా విజయనగరం జట్టు నిలిచింది. విజయనగరం, తూర్పుగోదావరి జట్ల మధ్య మూడు రోజులుగా జరుగుతున్న ఆఖరి మ్యాచ్‌లో విజయనగరం జట్టు 9 వికెట్ల తేడాతో తూర్పుగోదావరి జిల్లాజట్టుపై గెలిచింది. ఇప్పటికే విశాఖపట్నం, శ్రీకాకుళం జట్లపై గెలిచిన అతిథ్య జట్టు మూడో విజయం పొంది 18 పాయింట్లు తో పాయింట్ పట్టికలో అగ్రస్థానంలో నిలవడమే కాకుండా నార్త్ జోన్ విజేతగా నిలిచింది. జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించిన ఆటగాలను, కోచ్ లు చందక రమేష్, ఎస్ ఎస్ ఎస్ బహుదూర్, చందక చంద్రశేఖర్ లను జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఎంఎల్ ఎన్ రాజు, ట్రెజరర్ పి సీతారామరాజు, నార్త్ జోన్ క్రికెట్ అకాడమీ చైర్మన్ పి. సన్యాసిరాజు, సెలెక్టర్లు బంగార్రాజు, సర్ఫరాజ్, వర్మ అభినందించారు.










