మనిషికో మాట... పశువుకో దెబ్బ అంటారు పెద్దలు. అచ్చంగా అదే సామెతను గుర్తుచేస్తున్నారు విజయనగరం కార్పొరేషన్ ఒకటో డివిజన్ అయ్యప్పనగర్ వాసులు. వార్డు, పట్టణ, జిల్లా అధికారులు, జిల్లా సర్వోన్నత అధికారి కలెక్టర్‌కు విన్నవించినా తమ కాలనీలోని అక్రమ వాటర్ ప్లాంటును తొలగించడం లేదని, చివరికి వారు సీజ్ చేసిన బోరును గంట వ్యవధిలో తెరిచి యథేచ్ఛగా నిర్వహిస్తున్నా అధికారులు నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నారని వాపోతున్నారు. ప్రభుత్వ గెడ్డ స్థలాన్ని ఆక్రమించి, ఎలాంటి అనుమతులూ లేకుండా బోరు తవ్వినట్టు ఓవైపు నోటి మాటలతో అంగీకరిస్తూనే.... మరోవైపు రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి సమస్య పరిష్కారానికి మీనమేషాలు లెక్కిస్తున్నారని జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయ్యప్పనగర్ వాసుల కథనం ప్రకారం..
ప్రజాశక్తి - విజయనగరం ప్రతినిధి : నగరంలోని ఒకటో డివిజన్ అయ్యప్పనగర్ ప్రశాంతతకు మారుపేరు. ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. దీంతో, ఈ ప్రాంతంలో నివాసాల ఏర్పాటుకు జనం ఎంతో ఇష్టపడుతున్నారు. ప్రభుత్వ, ప్రయివేటు ఉద్యోగులు, అధికారులు, కొంతమంది రాజకీయ నాయకులు కూడా ఈ ప్రాంతంలో ఎక్కువగానే ఉన్నారు. గత మూడేళ్లలో క్రమంగా నివాసాలు పెరిగాయి. ఈ క్రమంలో ప్రతి ఇంటికీ ఓ బోరు అవసరం కావడంతో గత ఏడాది భూగర్భజలాలు అడుగంటాయి. కాలనీవాసులు బోరు మోటార్లు మార్చుకున్నా, లోతును పెంచినా ఫలితం లేకపోయింది. దీంతో, కాలనీలో చాలా మంది జియాలజిస్టులను రప్పించి పరిశోధనలు చేపట్టారు. చివరికి స్థానికంగా ఉన్న స్వాతీ ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ బోరు సుమారు 500 అడుగుల తోతులో ఉందని తేలింది. అందువల్లే కాలనీలో బోర్లు ఎండిపోయాయని, దాన్ని తొలగిస్తే తప్ప స్థానికంగా భూగర్భజలాలు అందుబాటులోకి వచ్చే అవకాశం లేదని కూడా తేల్చిచెప్పారు. తీరా కాలనీవాసులు ఆరా తీస్తే ఆ ప్లాంట్ పూర్తిగా ప్రభుత్వగెడ్డ స్థలంలో ఎలాంటి అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిందని కూడా తేలింది. దీంతో అక్రమ ప్లాంట్‌ను తొలగించాలంటూ ఇదే కాలనీలో నివాసం ఉంటున్న పబ్లిక్ ప్రొసిక్యూటర్ రఘురాం, ఇటీవల కాలం వరకు టు టౌన్ సిఐగా పనిచేసిన లక్ష్మణరావు సహా 120 మంది సంతకాలతో కూడిన వినతిపత్రాన్ని అయ్యప్పనగర్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్, పట్టణ పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యాన అందజేశారు. స్పందన లేకపోవడంతో 'జగనన్నకు చెబుదాం' పేరిట కలెక్టరేట్‌లో నిర్వహిస్తున్న గ్రీవెన్స్‌కు 9 సార్లు అందజేశారు. జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ముమ్మారు నేరుగా వినతులు స్వీకరించి, వెంటనే ప్లాంట్ సీజ్‌చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. జాయింట్ కలెక్టర్ రెండు సార్లు, ఆర్‌డిఒకు రెండు సార్లు అర్జీలిచ్చారు. మున్సిపల్ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్లకు కాలనీవాసులు తొమ్మిదిసార్లు సార్లు, జలవనరుల శాఖ అధికారులకు రెండు పర్యాయాలు వినతులు అందజేశారు. మేయర్ అందరూ పరిష్కరిస్తామని చెప్పడమే తప్ప అమలుకు ప్రయత్నం చేయలేదు. చివరకు జిల్లా కలెక్టర్ కూడా ఆదేశాలు తప్ప అమలు గురించి పట్టించుకోవడం లేదు. దీంతో అధికారులు ఓ ప్రతిజాప్రతినిధి ఒత్తిడికి తలొగ్గారని, చివరకు జిల్లా కలెక్టర్ కూడా మీనమేషాలు లెక్కిస్తే ప్రజలకు దిక్కెవరని కాలనీవాసులు ప్రశ్నిస్తున్నారు. ఒకానొక సందర్భంలో పోలీసుల సమక్షంలో మున్సిపల్ అధికారులు ప్లాంట్‌ను సీజ్‌చేసినప్పటికీ, గంట వ్యవధిలోనే తెరిచి యథేచ్ఛగా నిర్వహించుకుంటున్నా జిల్లా అధికారులు అచేతనంగా ఉండిపోవడం గమనార్హం.
అధికారాన్ని అడ్డం పెట్టుకుంటే ప్రభుత్వానికే నష్టం
స్థానిక నాయకులు అధికారాన్ని అడ్డంపెట్టుకుంటే ప్రభుత్వానికే నష్టం. అధికారులు ప్రజాస్వామ్య విలువలను పక్కనబెట్టి నాయకుల కనుసన్నల్లో నడుచుకోవడం సిగ్గుచేటు. మా సమస్యలు మాకు ఎలాగూ ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో కాలనీవాసులే కాదు, అయ్యప్పనగర్ వాసుల సమస్యను గమనిస్తున్న వారంతా పాలకులకు బుద్ధిచెప్తారు. స్పందన పేరును జగనన్నకు చెబుదాం అని మార్పుచేస్తే సరిపోదు. చెప్పిన సమస్యలు పరిష్కరిస్తేనే ప్రభుత్వంపై విశ్వాసం, నమ్మకం పెరుగుతాయి. చివరికి కలెక్టర్ కూడా ఇలా అచేతనంగా ఉండిపోతారని మేము అనుకోలేదు. అధికారులు న్యాయం చేయపోతే వారిపై న్యాయస్థానానికి వెళ్లేందుకు కూడా వెనుకాడేది లేదు.
- యుఎస్ రవికుమార్, అయ్యప్పనగర్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ పోరాట కమిటీ కన్వీనర్










