Sep 08,2023 19:17

సమావేశంలో మాట్లాడుతున్న వైసిపి జిల్లా అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ :  చంద్రబాబు నాయుడు టిడ్కో ఇళ్ల వ్యవహారంలో అవినీతికి పాల్పడినట్లు ఇన్‌కం టాక్స్‌ శాఖ ఇచ్చిన నోటీసుకు చంద్రబాబునాయుడు వెంటనే సమాధానం చెప్పాలని వైసిపి జిల్లా అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. శుక్రవారం జెడ్‌పి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2016, 17, 18 మధ్య టిడ్కో ఇళ్ల నిర్మాణం విషయంలో కాంట్రాక్టర్‌ దగ్గర నుంచి అప్పటి పిఎ శ్రీనివాస్‌ ద్వారా ముడుపులు అందినట్లు ఆధారాలతో సహా ఇన్‌కమ్‌ టాక్స్‌ శాఖ నోటీసులు ఇచ్చిందన్నారు. ఏ జిల్లా పర్యటనలకు వెళ్ళినా, ఎక్కడ బహిరంగ సభ పెట్టినా వైసిపి ప్రజాప్రతినిధులను అవినీతి పరులని చెబుతున్న చంద్రబాబు అదాయపు పన్ను శాఖ ఇచ్చిన నోటీసుకు ఎందుకు సమాధానం చెప్పడం లేదని ప్రశ్నించారు.
నోటీసుపై స్పందించకుందా తనను జైలులో పెట్టేందుకు వైసిపి ప్రభుత్వం చూస్తుందని అనడం ఆశ్చర్యకరంగా ఉందన్నారు. ఐటి నోటీసుకు సమాధానం చెప్పి నిజాయితీని నిరూపించుకోవాలని అన్నారు. మరోవైపు లోకేష్‌ చేపట్టిన పాదయాత్ర, బాబు బహిరంగ సభలు ప్రజా సమస్యలపైన కాకుండా కేవలం రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా, అల్లర్లు సష్టించే విధంగా ఉన్నాయన్నారు. వ్యక్తిగత దూషణలు, దుర్బాషలు మాట్లాడటం వంటి చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. భీమవరంలో రాళ్లు విసరడం, దాడులకు పాల్పడటం వంటి ఘటనలకు పాల్పడి అల్లర్లు సష్టించే ప్రయత్నం చేశారన్నారు. పాదయాత్ర విఫలం కావడంతో అసహనానికి గురై ఇటువంటి ఘటనలకు పాల్పడటం సరైంది కాదని పేర్కొన్నారు.