ప్రజాశక్తి- డెంకాడ (భోగాపురం) : మండలంలో జరుగుతున్న అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని ఎంపిపి ఉప్పాడ అనూష అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో ఆమె అధ్యక్షతన బుధవారం మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత అధికారులతో పాటు సభ్యులపై కూడా ఉందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు అందించడమే ప్రభుత్వం లక్ష్యమని అన్నారు. ముంజేరు సర్పంచ్ పూడి నూకరాజు మాట్లాడుతూ భోగాపురం జంక్షన్ నుంచి ముక్కాం వెళ్లే రహదారిలో మలుపుల వద్ద తరచు ప్రమాదాలు జరుగుతున్నందున స్పీడ్ బ్రేకర్లు వేయాలని కోరారు. రావాడ సర్పంచ్ పైడి నాయుడు మాట్లాడుతూ జగనన్న కాలనీలో విద్యుత్ స్తంభాలు ఇళ్లకు ప్రమాదకరంగా ఉన్నాయని వాటిని మార్చాలని కోరారు. ఈ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని సంబంధిత అధికారులు తెలియజేశారు. ఉపాధి హామి పథకంలో లింగాలవలస, చేపలకంచేెరు, చాకివలస పంచాయతీలలో పని చేసేందుకు పనులు లేనందున వారికి పక్క పంచాయతీలో పనులు కల్పించాలని ఎంపిపి సలహాదారు ఉప్పాడ సూర్యనారాయణ రెడ్డి ఉపాధి హామీ పథకం ఎపిఒ ఆదిబాబుకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఒ అప్పలనాయుడు, తహశీల్దార్ చింతాడ బంగార్రాజు, వైస్ ఎంపిపిలు రావాడ బాబు, పడాల సత్యవతి తదితరులు పాల్గొన్నారు.










