ప్రజాశక్తి-విజయనగరం : మరింత బాధ్యతాయుతంగా పనిచేసి, అభివృద్ధిలో రాష్ట్రంలోనే జిల్లాకు ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చేందుకు అధికారులు కృషి చేయాలని ఉపముఖ్యమంత్రి, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి బూడి ముత్యాలనాయుడు పిలుపునిచ్చారు. కలెక్టర్ నాగలక్ష్మి ఆధ్వర్యంలో బొబ్బిలి నియోజకవర్గ అభివృద్ధిపై కలెక్టరేట్ ఆడిటోరియంలో శనివారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. వ్యవసాయం, నీటి పారుదల, నాడు-నేడు, వైద్యారోగ్యం, గృహనిర్మాణం, డ్వామా, తదితర అంశాలపై సమీక్షించారు. ఆయా శాఖల అధికారులు శాఖాపరంగా బొబ్బిలి నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రగతి నివేదికలను వివరించారు.
ఈ సందర్భంగా ఇన్‌ఛార్జి మంత్రి ముత్యాలనాయుడు మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి యంత్రాంగం చేస్తున్న కృషిని అభినందించారు. అధికారులు ప్రతి పనికీ నివేదికలు, అనుమతుల కోసం వేచి చూడకుండా, తమ పరిధిలోని సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సూచించారు. వందశాతం ఇ-క్రాప్ నమోదు కావాలని, లేదంటే రైతులు నష్టపోతారని సూచించారు. శివారు భూములకు సైతం సాగునీరు అందేలా చూడాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. అక్టోబరుకు అన్ని సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వెల్‌నెస్ సెంటర్ల నిర్మాణాన్ని పూర్తిచేసి, వినియోగంలోకి తేవాలని మంత్రి స్పష్టంచేశారు. పిహెచ్‌సిలు, సిహెచ్‌సిల భవనాలను త్వరగా పూర్తి చేయాలన్నారు. ఆస్పపత్రుల్లో లైట్లు, ఫ్యాన్లు పూర్తిస్థాయిలో బిగించాలని, కిటికీలను మెష్‌లను ఏర్పాటు చేయాలని చెప్పారు. ఉన్నతాధికారులు తరచూ క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను తనిఖీ చేయాలని సూచించారు. ఇళ్లపై వెళ్తున్న విద్యుత్తు వైర్లను పక్కకు మార్చి, ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని, పాత విద్యుత్తు స్థంభాల స్థానంలో సిమెంటు స్థంభాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
జెడ్‌పి ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ బొబ్బిలి సిహెచ్‌సి అభివృద్ధికి సిఎస్‌ఆర్ నిధులను ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. పడకల సంఖ్యను 50కి పెంచాలని, దానికి అసరమైన సామగ్రి కోసం తక్షణమే ప్రతిపాదనలు రూపొందించాలని సూచించారు. తెర్లాంలో విద్యుత్తు సమస్యలు ఎక్కువగా వస్తున్నాయని, పెద్ద మండలం కావడంతో, పూర్తిస్థాయిలో విద్యుత్తు సిబ్బందిని నియమించాలని కోరారు. బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి వెంకట చినప్పలనాయుడు మాట్లాడుతూ నియోజకవర్గంలోని పలు సమస్యలు ప్రస్తావించారు. గొల్లపల్లిలో కొత్త ఆర్‌బికెను మంజూరు చేయాలని కోరారు. తెర్లాం, ఇతర మండలాల్లో విద్యుత్ సమస్యలను ప్రస్తావించారు. తోటల మధ్యనుంచి విద్యుత్తు లైన్లు వేశారని, వాటిని రోడ్డు పక్కకు మార్చాలని కోరారు. వ్యవసాయ కనెక్షన్లు పెండింగ్ లేకుండా వెంటనే ఇప్పించాలన్నారు. సమావేశంలో కలెక్టర్ నాగలక్ష్మి, జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, డిఆర్‌ఒ ఎం.గణపతిరావు, సిపిఒ పొదిలాపు బాలాజీ, బొబ్బిలి మున్సిపల్ ఛైర్మన్ మురళీకృష్ణ, వివిధ శాఖల జిల్లా అధికారులు, బొబ్బిలి నియోజకవర్గంలోని ఎంపిపిలు, జెడ్‌పిటిసిలు, అధికారులు పాల్గొన్నారు.










