Aug 19,2023 19:47

విలేకర్ల సమావేశంలో మాట్లాడుతున్న జెడ్‌పి చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : జిల్లాలో పరిశ్రమలను ప్రోత్సహిస్తుంటే ఓర్వలేక టిడిపి నాయకులు విమర్శలు చేస్తున్నారని వైసిపి జిల్లా అధ్యక్షులు, జెడ్‌పి చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. పరిశ్రమ ఏర్పాటు చేస్తామని కళా వెంకటరావు తీసుకున్న భూమి వెనక్కి ఇచ్చి మాట్లాడాలని హితవుపలికారు. శనివారం జెడ్‌పి సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పారిశ్రామిక అభివృద్ధి కోసం బొబ్బిలి గ్రోత్‌సెంటర్‌ ఏర్పాటు చేశారన్నారు. పరిశ్రమ పెడతామని ఒక సంస్థ ముందుకొస్తే వారికి ప్రభుత్వం భూములు కేటాయించిందన్నారు. కంపెనీకి భూములు కేటాయిస్తే, అది మంత్రి బొత్స సోదరులకు కేటాయించినట్లు వక్రీకరిస్తున్నారని చెప్పారు. అభివృద్ధి చేస్తామంటే టిడిపికి కంటగింపుగా మారిందన్నారు. మాజీమంత్రి కళా వెంకట్రావు కుమారుడికి చంద్రబాబు పది ఎకరాల భూమి ధారాదత్తం చేశారన్నారు. ముందు కళా వెంకట్రావు కుమారుడికి ఇచ్చిన భూములు వెనక్కి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.
ఎవరైనా కంపెనీలు పెడతామంటే అంతకన్నా తక్కువ ధరకు కేటాయిస్తామన్నారు. పరిశ్రమలను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని, ఎవరు పరిశ్రమలు పెట్టేందుకు వచ్చినా వారికి భూమి తక్కువకు ఇవ్వడంతోపాటు అన్ని విధాలా సహకారాన్ని అందిస్తామని తెలిపారు. టిడిపి నేతలు తీరును ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. విలేకరుల సమావేశంలో డిసిసిబి వైస్‌చైర్మన్‌ చనుమల్ల వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.