ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : పేదలకు ఉపయుక్తంగా ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం అభినందనీయమని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. మంగళవారం స్థానిక రంగాల వీధిలో శ్రీ గౌరీ సేవా సంఘం, రోటరీ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. డాక్టర్ తిరుమల ప్రసాద్ ఆధ్వర్యంలో వైద్య శిబిరంలో పేదలకు వైద్య సేవలు అందించారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ.. పేదలకు వైద్యసాయాన్ని అందించాలన్న మంచి ఆలోచన పలువురికి ఆదర్శప్రాయంగా నిలుస్తుందన్నారు. గౌరీ సేవా సంఘం, రోటరీ క్లబ్ సంయుక్త నిర్వహణలో వైద్య శిబిరాన్ని నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేయడం మంచి కార్యక్రమాన్ని కొనియాడారు. తాము ఏర్పాటు చేసిన ఫుడ్ బ్యాంకులకు రెండేళ్లుగా నిరంతరంగా ఆహారాన్ని అందిస్తున్న గౌరీ సేవా సంఘం ప్రతినిధులను అభినందించమన్నారు. ప్రతినెల ఈ సంఘం తరఫున వైద్య శిబిరాన్ని రంగాల వీధిలో ఉన్న కమ్యూనిటీ హాల్లో నిర్వహిస్తామని నిర్వాహకులు చెప్పడం ఆనందాన్నిస్తోందన్నారు. ప్రభుత్వ పరంగానే కాకుండా సామాజిక, స్వచ్ఛందంగా పలువురు ముందుకు వచ్చి వైద్య సేవలు, వైద్య శిబిరాలు మరిన్ని ఏర్పాటు చేసినట్లయితే పేదలకు ఎంతో మేలు చేకూరుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో లోక్ సత్తా పార్టీ నాయకులు భీశెట్టి బాబ్జి, గవర కార్పొరేషన్ డైరెక్టర్ రుక్మిణి, వైసిపి నాయకులు యడ్ల రాజేష, ఏ ఏ రావు, కాండ్రేగుల శేఖర్ తదితరులు పాల్గొన్నారు.










