Aug 25,2023 20:43

- ప్రజా సమస్యలపై 30 నుంచి సమర భేరి : సిపిఎం
ప్రజాశక్తి - విజయనగరం టౌన్‌ :గిరిజనులకు ఉన్నత విద్యను అందించేందుకు విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేస్తున్న గిరిజన యూనివర్సిటీకి చేయాల్సింది శంకుస్థాపనలు కాదని, నిధులు కేటాయించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు, కె.లోకనాధం అన్నారు. రాష్ట్ర విభజన సందర్భంలో కేంద్రం ప్రకటించిన గిరిజన యూనివర్సిటీ పదేళ్లయినా ఇంకా శంకుస్థాపన దశలోనే ఉండడమంటే గిరిజనుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎంత శ్రద్ధ ఉందో అర్ధమవుతోందని తెలిపారు. వర్సిటీకి నిధులు రప్పించడంలో, నిర్మాణం చేపట్టడంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. విజయనగరంలోని ఎల్‌బిజి భవనంలో శుక్రవారం వారు విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. వామపక్షాలు, ప్రజా సంఘాల ఐక్య ఉద్యమాలు ఫలితంగా గతంలో చంద్రబాబునాయుడు కొత్తవలస మండలం రెల్లివద్ద స్థలం కేటాయించి శంకుస్థాపన చేశారని, ప్రహరీ కూడా నిర్మించారని తెలిపారు. జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత వర్సిటీని గిరిజన ప్రాంతంలో ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో కాలయాపన చేశారన్నారు. ఈ పదేళ్లలో వర్సిటీ నిర్మాణం కోసం నిధుల గురించి కేంద్రాన్ని ఎందుకు అడగలేదని ప్రశ్నించారు. తక్షణం నిధులు మంజూరు చేసేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని డిమాండ్‌ చేశారు.
30 నుంచి సమరభేరి
ప్రజా సమస్యలను పరిష్కరించాలని, భారాలను ఉపసంహరించాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 30 నుంచి సెప్టెంబర్‌ 4వ వరకు రాష్ట్ర వ్యాప్తంగా సమరభేరి నిర్వహిస్తున్నట్లు వెంకటేశ్వరరావు, లోకనాధం తెలిపారు. విద్యుత్‌ భారాలు ఉపసంహరించాలని కోరుతూ ఈ నెల 28న విద్యుత్‌ అమరవీరుల సంస్మరణ సభలు నిర్వహిస్తామన్నారు. విజయనగరం జిల్లాలో ఇప్పటికే ఉన్న జ్యూట్‌ మిల్లులు మూతపడి వేలాది మంది రోడ్డున పడ్డారని అన్నారు. కొత్త పరిశ్రమలు రాకపోగా ప్రభుత్వం పెంచిన విద్యుత్‌ ధరల వల్ల జిల్లాలోని పెర్రో ఎల్లాయీస్‌ పరిశ్రమలు మూతపడే పరిస్థితి ఏర్పడిందన్నారు. రైతులు, ప్రజలు తీవ్ర భారాలు మోయాల్సి వస్తుందన్నారు. తక్షణమే విద్యుత్‌ ఛార్జీలు, ట్రు అప్‌ఛార్జీలు, సర్‌ ఛార్జీల పేరిట వేస్తున్న భారాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ పాల్గొన్నారు.