ప్రజాశక్తి-బొబ్బిలి (విజయనగరం) : శ్రీలక్ష్మి శ్రీనివాస జ్యూట్ మిల్లు నూతన పర్మినెంట్, బదిలీ కార్మికులకు పిఎఫ్ సొమ్ము కట్టించే బాధ్యత ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడుదేనని సిఐటియు జిల్లా అధ్యక్షులు పి.శంకరరావు అన్నారు. స్థానిక సిఐటియు కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ 2020 ఫిబ్రవరి నాటికి కార్మికులకు చెల్లించాల్సిన గ్రాడ్యుటి, పిఎఫ్ బకాయిలు చెల్లిస్తామని 2019లో ఎమ్మెల్యే సమక్షంలో ఆదర్శ కార్మిక సంఘం, కార్మిక శాఖాధికారులు ఆధ్వర్యంలో ఒప్పందం జరిగినప్పటికీ ఎన్నో పోరాటాలు చేస్తే పాత పర్మినెంట్ కార్మికులకు గ్రాడ్యుటి బకాయిలు చెల్లించినప్పటికి నూతన పర్మినెంట్, పాత పర్మినెంట్, బదిలీ కార్మికులకు పీఎఫ్ బకాయి రూ.2.30కోట్లు చెల్లించకపోవడంతో కార్మికులకు పీఎఫ్ పింఛన్ రావడం లేదన్నారు. 1500మంది కార్మికులకు చెల్లించాల్సిన పీఎఫ్ బకాయి రూ.2.30 కోట్లలో రూ.60లక్షలు మాత్రమే కెవిఆర్ చెల్లిస్తామని చెప్పడం దుర్మార్గమన్నారు. ఎమ్మెల్యే సమక్షంలో జరిగిన ఒప్పందాన్ని యాజమాన్యం అమలు చేయకపోవడం దుర్మార్గమన్నారు. కార్మికుల పిఎఫ్ బకాయి చెల్లించేలా ఎమ్మెల్యే జోక్యం చేసుకుని న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేనిచో పోరాటం చేస్తామన్నారు.
ఈనెల 26న జ్యూట్ మిల్లు వద్ద కార్మికులతో సమావేశం
జ్యూట్ కార్మికులకు జరిగిన అన్యాయంపై ఈనెల 26న శ్రీలక్ష్మి శ్రీనివాస జ్యూట్ మిల్లు వద్ద కార్మికులతో సమావేశం ఏర్పాటు చేస్తున్నామని సిఐటియు జిల్లా అధ్యక్షులు పి.శంకరరావు చెప్పారు. సమావేశంలో పిఎఫ్ బకాయిలపై చర్చించి కార్యక్రమాన్ని రూపొందిస్తామని చెప్పారు. సమావేశానికి శనివారం ఉదయం 10గంటలకు హాజరు కావాలని కోరారు. విలేకరుల సమావేశంలో సిఐటియు నాయకులు బి.శ్రీనివాసరావు, కార్మికుడు శంకరరావు ఉన్నారు.










