ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : విజయనగరం పట్టణంలో గల బిసి బాలుర వసతి గృహంలో మౌలిక సదుపాయాలు కల్పించాలని సోమవారం కలెక్టరేట్ ఎదుట ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం సమస్యలను వినతి రూపంలో డిప్యూటీ కలెక్టర్‌కు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు ఎం.సౌమ్య మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ హాస్టల్ పట్ల పూర్తిస్థాయిలో నిర్లక్ష్యం చేస్తుందన్నారు. దీనిలో భాగంగా విజయనగరం పట్టణంలో గల బాలుల (బీసీ 1-2) హాస్టల్‌లో మౌలిక సదుపాయాలు కూడా ఏర్పాటు చేయలన్నారు. హాస్టల్‌లో తాగడానికి నీరు లేని పరిస్థితుల్లో ఈరోజు విద్యార్థులు ఉన్నారన్నారు. మాన్ హౌల్స్ లీక్ అవడంపై అధికారులు తెలియజేసిన పట్టించుకోవడంలేదన్నారు. చుట్టూ పరిసరాలు శుభ్రం చేయకపోవడం వల్ల అధికంగా దుర్వాసన రావడం, దోమల వల్ల విద్యార్థులు అనారోగ్యానికి గురవుతున్నారన్నారని తెలిపారు. మార్కెట్లో పెరుగుతున్న సరుకులు ధరలకు అనుకూలంగా మెస్ చార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కారం కానీ ఎడల పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ పట్టణ కార్యదర్శి పి రమేష్, పట్టణ గర్ల్స్ కన్వీనర్ లావణ్య, పట్టణ ఉపాధ్యక్షులు వెంకటరమణ, శ్రీను మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.










