Aug 30,2023 20:53

మున్సిపల్‌ అధికారులు తొలగించిన పునాదులను మళ్లీ కట్టిన అక్రమార్కులు

ప్రజాశక్తి-బొబ్బిలి : బొబ్బిలి మున్సిపాలిటీలో పేదల కోసం ఏర్పాటుచేసిన ఇందిరమ్మ కాలనీలో నకిలీ ఇళ్ల పట్టాలతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. ఇందిరమ్మ కాలనీలో నకిలీ పట్టాలు తయారు చేసి ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి, పునాదులు నిర్మిస్తున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు. రెవెన్యూ, మున్సిపల్‌ అధికారులు ఉదాసీనతగా ఉండడంతో అక్రమార్కుల దందా అడ్డూ అదుపూ లేకుండా సాగిపోతోంది. నకిలీ పట్టాల తయారీలో పంచాయతీ విఆర్‌ఒ హస్తం ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
బొబ్బిలి పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో నివాసముంటున్న అధికార పార్టీకి చెందిన చోటా నాయకుల కన్ను అదే కాలనీలోని ఖాళీ స్థలాలపై పడింది. ఇదే అదునుగా భావించిన ఒక చోటా నాయకుడు పంచాయతీ విఆర్‌ఒ సహకారంతో నకిలీ పట్టాలు తయారు చేసి, అధికార పార్టీ నేతల అండదండలతో ప్రభుత్వ స్థలంలో పునాదులు వేశారు. నకిలీ పట్టాలతో ఆయా పునాదులను రూ.3 లక్షల వరకు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. దీనిపై అదే కాలనీలో నివాసముంటున్న మరో గ్రూపు చోటా నాయకులు ఎమ్మెల్యే శంబంగి వెంకట చినప్పలనాయుడుకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎమ్మెల్యే ఆదేశాల మేరకు మున్సిపల్‌ అధికారులు జెసిబితో పునాదులను తొలగించారు. కొన్ని నెలల తర్వాత రెండు గ్రూపులు ఒక్కటవ్వడంతో మున్సిపల్‌ అధికారులు తొలగించిన పునాదులను మళ్లీ నిర్మించేశారు.
ఖాళీ స్థలం కనిపిస్తే కబ్జా
ఇందిరమ్మ కాలనీలో ఖాళీ స్థలం కనిపిస్తే కబ్జా చేస్తున్నారు. కాలనీలో రెండు లేఅవుట్లు వేశారు. మొదట లేఅవుట్లో 1723 ప్లాట్లు, రెండో లేఅవుట్లో 625 ప్లాట్లు ఉన్నాయి. 2004లో వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పట్టణ పేదల కోసం ఇందిరమ్మ కాలనీ పేరుతో లేఅవుట్లు వేశారు. ఇందిరమ్మ మొదటి విడత, రెండో విడతలో 20 వార్డుల్లో ఎంపిక చేసిన 2,150 మందికి పైగా ఇళ్ల స్థలాలు పంపిణీ చేసి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశారు. వీటిలో 110 మంది పూర్తిగా ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించకపోవడంతో పట్టాలు రద్దు చేయాలని అప్పటి హౌసింగ్‌ అధికారులు రెవెన్యూ అధికారులకు లేఖ రాశారు. ఇందిరమ్మ కాలనీలో రెండు లేఅవుట్లలో 2,348 ప్లాట్లు వేయగా, మరో 150 ఇళ్ల స్థలాలకు సరిపడిన స్థలాన్ని అప్పటి రెవెన్యూ అధికారులు ఖాళీగా ఉంచేశారు. 2014లో టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఖాళీగా ఉన్న స్థలంలో లేఅవుట్లు వేసి నచ్చిన వారికి పంచుకున్నారు. ఇందిరమ్మ రెండు విడతలలో పేదలకు ఇచ్చిన ఇళ్లల్లో 110 మంది పూర్తిగా పనులు ప్రారంభించకపోవడంతో రద్దు చేసేందుకు ప్రయత్నాలు చేశారు. ఆయా స్థలాలను కొంతమంది కబ్జా చేసి అమ్ముకుని సొమ్ము చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. రెండు లేఅవుట్లలో పేదలకు ఇవ్వకుండా 180కు పైగా ఇళ్ల స్థలాలు ఖాళీగా ఉన్నాయి. వాటికి నకిలీ పట్టాలు సృష్టించి అక్రమార్కులు అమ్ముకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి.
అధికార పార్టీ నేతల దన్ను
ఇందిరమ్మ కాలనీలో ఇళ్ల స్థలాలు ఆక్రమణ, నకిలీ పట్టాలు తయారీకి అధికార పార్టీ నేతల అండదండలు పుష్కలంగా ఉన్నట్లు సమాచారం. నకిలీ పట్టాలతో అమ్ముకుంటున్న స్థలాల వల్ల వచ్చిన సొమ్మును ఇందిరమ్మ కాలనీ చోటా నాయకులు, అధికార పార్టీ నేతలు పంచుకుంటున్నారని స్థానికంగా చర్చ సాగుతోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇందిరమ్మ కాలనీలో నకిలీ పట్టాలపై సమగ్ర దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
బాధ్యత రెవెన్యూ అధికారులదే
ఇందిరమ్మ కాలనీలో ఆక్రమణలపై చర్యలు తీసుకుంటున్నామని మున్సిపల్‌ కమిషనర్‌ ఎస్‌.శ్రీనివాసరావు తెలిపారు. నకిలీ పట్టాలు ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయని, వాటిపై దర్యాప్తు చేసి గుర్తించి చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులకు లేఖ రాస్తామని చెప్పారు. ఇందిరమ్మ కాలనీలో ప్రభుత్వ స్థలాలు అక్రమిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.