Aug 24,2023 20:43

చినమేడపల్లి వద్ద సిఎం శంకుస్థాపన చేయనున్న స్థలం

ప్రజాశక్తి - విజయనగరం ప్రతినిధి : గిరిజన విశ్వవిద్యాలయం... ఈ పేరు మన రాష్ట్రంలో తొమ్మిదేళ్లుగా వినిపిస్తున్నమాట. ఆ మాటలు కోటలు దాటినా ఆచరణ గడప దాటలేదు. కేంద్ర ప్రభుత్వ కొర్రీలు, రాష్ట్ర ప్రభుత్వాల చిత్తశుద్ధి లోపంతో తొమ్మిదేళ్ల తరువాత నేడు రెండోసారి శంకుస్థాపన కార్యక్రమం జరుగుతోంది. ఇప్పటికైనా ఆచరణలో ముందుకు సాగుతుందా? లేక ఇదంతా ఎన్నికల ఎత్తుగడల్లో భాగమేనా? అన్న సందేహాలు వ్యక్తమౌతున్నాయి. గత అనుభవాలు, ప్రస్తుత ప్రకటనలు ఇందుకు ఉదాహరణగా చాలా మంది చెప్తున్నారు. దీనికితోడు నిర్వాసితులకు పూర్తిస్థాయిలో పరిహారం చెల్లించకుండా శంకుస్థాపనకు సిద్ధపడడంపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రాష్ట్ర విభజన సందర్భంగా ఉమ్మడి విజయనగరం జిల్లాలో గిరిజన వర్సిటీ ఏర్పాటుకు అప్పట్లో కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన విషయం విదితమే. దీని ఏర్పాటుకు తొలుత 'అదుగో ఇదిగో..' అంటూ నెట్టుకొచ్చింది. గతంలో టిడిపి, నేటి వైసిపి ప్రభుత్వాలు కూడా భూసేకరణ పేరుతో కాలం గడిపాయి. టిడిపి ప్రభుత్వంలోనే కొత్తవలస మండలం రెల్లి రెవెన్యూ పరిధిలో 526 ఎకరాల భూమి సేకరించి, నష్టపరిహారం కూడా చెల్లించినప్పటికీ వైసిపి వచ్చాక రద్దు చేసింది. నాలుగైదు చోట్ల భూమి పరిశీలించి చివరికి మెంటాడ మండలం కుంటినవలస మధుర గ్రామం చినమేడపల్లి, దత్తిరాజేరు మండలం మర్రివలసలో భూమిని గుర్తించారు. అనేక ఊగిసలాటల తరువాత కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఏర్పాటు చేసేందుకు అంగీకరించింది. ఈ నేపథ్యంలో విశ్వవిద్యాలయం నిర్మాణానికి 561.91 ఎకరాల భూసేకరణ ప్రక్రియ పూర్తయింది. ఈ ప్రక్రియను సకాలంలో పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.37.45 కోట్లు కేటాయించింది. నేడు (ఈనెల 25న) సిఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ కూడా హాజరు కానున్నారు.
కానీ, నిర్మాణ పనులపైనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. భూమి గుర్తింపు, దాని ఖరారు చేయడం, అప్పగింతలకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తొమ్మిదేళ్లు తాత్సారం చేశాయంటే నిర్మాణానికి ఇంకెన్నాళ్లో అంటూ అనుమానాలు రావడం సహజమే. ఇందుకు కారణం కూడా లేకపోలేదు. 2013లో రాష్ట్ర విభజన జరిగినప్పటికీ 2019-20లో వరకు గిరిజన వర్శిటీ ఏర్పాటుకు కేంద్రం అనుమతులు ఇవ్వలేదు. ఎట్టకేలకు 2019లో ఏర్పాటు చేసినప్పటికీ తొలి నాలుగేళ్లూ నిధులు కేటాయించలేదు. ఆ తరువాత తరగతుల నిర్వహణకు తగ్గట్టు లేదా అంతకన్నా తక్కువ రూ.18కోట్ల చొప్పున కేటాయిస్తూ వచ్చింది. మౌలిక సదుపాయాల పేరిట రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.50కోట్లు ఏమూలకూ సరిపోని పరిస్థితి ఉందని విద్యావేత్తలు చెబుతున్నారు. మరోవైపు స్థల గుర్తింపు, సేకరణ పేరుతో నాటి టిడిపి ప్రభుత్వం కూడా తీవ్ర జాప్యం చేసింది. తొలుత పాచిపెంట మండలంలోనూ, ఆ తరువాత సాలూరు మండలం కొట్టక్కి, అనంతరం విజయనగరం మండలం గుంకలాం వద్ద భూములను పరిశీలన చేశారు. ఇలా సుమారు మూడేళ్లు కాలం గడిపిన తరువాత నాలుగో ఏట ఎట్టకేలకు 2019 ఎన్నికలకు ముందు అప్పటి టిడిపి ప్రభుత్వం కొత్తవలస మండలం రెల్లి రెవెన్యూ పరిధిలో 526 ఎకరాల భూమిని సేకరించింది. అక్కడి గిరిజనులకు రూ.కోట్ల పరిహారం కూడా చెల్లించింది. రూ.5కోట్ల వ్యయంతో రక్షణ గోడ నిర్మాణం కూడా చేపట్టారు. అనంతరం వైసిపి అధికారంలోకి రావడంతో కథ మొదటికి వచ్చింది. మళ్లీ స్థల సేకరణ కోసం వేట ప్రారంభించి ఎట్టకేలకు గతేడాది దత్తిరాజేరు - మెంటాడ మండలాల సరిహద్దు గ్రామాల్లో భూసేకరణ చేపట్టి నేడు శంకుస్థాపనకు సిద్ధమౌతున్నారు. తాము అధికారంలోకి వస్తే వర్శిటీని మార్పుచేస్తామంటూ టిడిపికి చెందిన పార్వతీపురం నియోజకవర్గ నాయకులు ప్రకటన చేయడంతో పూటకో ఊరు... రోజుకో ప్రాంతం అంటూ అన్నట్టుగా ఉందని చాలా మంది వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు తమకు పూర్తిస్థాయిలోను, ముందుగా చెప్పిన ప్రకారం పరిహారం ఇవ్వడం లేదంటూ మర్రివలస, కుంటినవలస గ్రామాలకు చెందిన నిర్వాసితులు డి-పట్టాదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనధికారికంగా సాగులోవున్న చిన్నసన్నకారు రైతులకు కనీసం పరిహారం ఇవ్వలేదు. ఇంకా రూ.1.37కోట్ల మేర చెల్లించాల్సివుందని సాక్షాత్తు అధికారులే చెబుతున్నారు.
ఎయు క్యాంపస్‌లో తరగతులు
ప్రస్తుతం గాజులరేగ సమీపంలో పాత ఎయు క్యాంపస్‌లో గిరిజనవర్శిటీ తరగతులు నిర్వహిస్తున్నారు. వర్శిటీలో 200మంది విద్యార్థులు ఉన్నారు. కేవలం 13డిపార్ట్‌మెంట్లలో 14 రకాల కోర్సులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మరికొన్ని కోర్సుల ఏర్పాటుకు అనుమతులు లభించినప్పటికీ వసతి సమస్య వల్ల ముందుకు సాగలేని పరిస్థితి. ఉన్న డిపార్ట్‌మెంట్లకే భవనాలు, గదులు సరిపోవడం లేదు. ఇక విద్యార్థుల సమస్యల గురించి వేరేగా చెప్పనక్కర్లేదు. లేబొరేటరీ, లైబ్రరీ, ఆటస్థలాలు, జిమ్‌, పరిశోధనకు అవసరమైన ఇతర సదుపాయాలు లేకపోవడం వల్ల సీతం, ఎంవిజిఆర్‌ ఇంజినీరింగ్‌ కాలేజీలు, మాన్సాస్‌ పరిధిలోని ఎంఆర్‌ అటానమస్‌, ఎంఆర్‌ డిగ్రీ కాలేజీలపై ఆధార పడుతున్నారు.
తరగతులొక చోట, ప్రయోగాలు మరోచోట, పరిశోధనలు ఇంకోచోట జరుగుతుండడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్శిటీకి హస్టల్‌ నిర్వహణకు నిధులు ఉన్నప్పటికీ అందుకు తగ్గ భవనం లేదు. దీంతో, సమీపంలోని సీతం కాలేజీ యాజమాన్యంతో ఒప్పందం కుదుర్చుకుని అక్కడ 100మంది విద్యార్థులకు హాస్టల్‌ సదుపాయం కల్పించారు. మిగిలిన విద్యార్థులు అక్కడ కూడా ఉండేందుకు అవకాశం లేకపోవడంతో ముఖ్యంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన విద్యార్థులు వెనుదిరుగు తున్నారు. ఇక సెమినార్‌ హాళ్లు, ఆట స్థలాలు, సెంట్రల్‌ లైబ్రరీ వంటి సదుపాయాల గురించి వేరేగా చెప్పనక్కర్లేదు. గిరిజన ప్రాంతాలపై పరిశోధనలు అనే మాటే లేదు. దీంతో, గిరిజన వర్శిటీ లక్ష్యం నీరుగారుతోంది. ఈ నేపథ్యంలో స్థలాల గుర్తింపు, సేకరణకే తొమ్మిదేళ్లు పడితే నిర్మాణానికి, అందుకు తగ్గ నిధులు కేటాయించడానికి ఇంకెన్ని దశాబ్ధాలు పడుతుందో అంటూ పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.