పుష్కలంగా వర్షం కురిసింది. అందుకు తగ్గట్టే పొలం తడిసింది. వరినారు ఏపుగా పెరిగింది. కానీ, ఉబాలు లక్ష్యానికి అనుగుణంగా ముందుకు సాగలేదు. చెరకు, పత్తి, మొక్కజొన్న తదితర పంటలు కూడా అంతంత మాత్రంగానే సాగయ్యాయి. ఇందుకు ముమ్మాటికీ పాలకులు ప్రదర్శించిన నిర్లక్ష్యమే కారణం. దీంతో రైతాంగం ఆందోళనకు గురౌతోంది. పెట్టుబడులు ఏమౌతాయో అన్న బెంగ ఓ వైపు.. శ్రమ వృథాగా పోతుందా? అన్న ఆందోళన ఇంకోవైపు. ఏ రైతును కదిపినా ఇదే వ్యథ.
ప్రజాశక్తి - విజయనగరం ప్రతినిధి : ల్లాలో సాధారణంగా జూన్ చివరి నుంచి ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావాల్సి ఉంది. గత కొన్నాళ్ల నుంచి రుతుపవనాలు ఆలస్యం కావడంతో జులై ఒకటి లేదా రెండో వారంలోనైనా నారు పోతలు మొదలయ్యేవి. ఈ ఏడాది అందుకనుగుణంగా వర్షాలు కురవడంతో వరినారు పోతలు, ఇతర పంటల సాగు ఒకింత ఉత్సాహంగానే మొదలైంది. అయినప్పటికీ కురిసిన వర్షపునీటిని ఒడిసిపట్టేందుకు తగిన సాగునీటి వనరులు లేకపోవడంతో సముద్రం పాలైంది. మరోవైపు ఎండల తీవ్రత కూడా ఎక్కువగా ఉండడంతో కాస్త చెరువుల్లో చేరిన నీరు ఆవిరైపోతోంది. దీంతో, ఎదిగిన వరినారు ముందు పెట్టుకుని వరుణుడి కోసం ఎదురు చూడాల్సిన దుస్థితి ఏర్పడింది. జిల్లా ప్రధాన పంట వరి. ఖరీఫ్ సీజన్‌లో 2,25,637 ఎకరాల్లో సాగు కావాల్సి ఉండగా ఇప్పటి వరకు 75,770 ఎకరాల్లో మాత్రమే నాట్లు పడ్డాయి. గత ఏడాది ఇదే సరిగ్గా సమయానికి 1,35,477 ఎకరాల్లో నాట్లు పడ్డాయి. దీన్నిబట్టి సుమారు 30 శాతం వెనుకబడి ఉన్నట్టు స్పష్టమౌతోంది. మొక్కజొన్న గత ఏడాది ఇదే సమయానికి 29,472 ఎకరాల్లో సాగవగా, ప్రస్తుతం 19,885 ఎకరాల్లో మాత్రమే సాగైంది. ఇందులోనూ 25 శాతం వ్యత్యాసం కనిపిస్తోంది. పత్తి గతేడాది 4,310 ఎకరాలు సాగు కాగా, ప్రస్తుతం 3 వేలకు మించలేదు. చెరకు సాగు 10,392 ఎకరాలకు గాను ప్రస్తుతం 7 వేల ఎకరాలు మాత్రమే సాగైంది. వేరుశనగ గతేడాది ఇదే సమయానికి 767 ఎకరాలు కాగా, ఈ ఏడాది 420 ఎకరాల్లో మాత్రమే సాగు అయింది. నువ్వులు, ఇతర అపరాలు తదితర పంటలన్నింటి సాగులోనూ ఇదే రకమైన వెనుకబాటు కనిపిస్తోంది.
జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్‌లో అన్ని పంటలు కలుపుకుని 3,17,052 ఎకరాల మేర సాగు విస్తీర్ణం కాగా, గత ఏడాది ఇదే సమయానికి 2,01,535 ఎకరాల్లో సాగు కనిపించింది. ఈ ఏడాది కేవం 1, 38,755 ఎకరాల్లోనే పంటలు సాగయ్యాయి. గత ఏడాది అన్ని పంటలూ కలుపుకుని ఈ సమయానికి 64 శాతం సాగవగా, ఈ ఏడాది 43 శాతమే సాగయ్యాయి. మరోవైపు సీజన్ ముంచుకెళ్తోంది. వర్షపాతాన్ని పరిశీలిస్తే సాధారణ వర్షపాతం కన్నా 10 మిల్లీమీటర్ల వర్షపాతం అధికంగానే కురిసింది. జూన్ నుంచి ఇప్పటి వరకు 340.2 మిల్లీమీటర్ల వర్షపాగానికి గాను ఇప్పటి వరకు 440.1 మి.మీ వర్షం కురిసింది. దీన్నిబట్టి వర్షాలు కురిసినా వాటిని నిల్వచేసేందుకు తగిన వనరులు ప్రభుత్వం తయారు చేయలేదన్నది స్పష్టమౌతోంది.










