Sep 06,2023 16:33

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : ఈ నెల 2 తేదీ నుంచి 4 తేదీ వరకు జార్కండ్‌లోని రాంచీలో జరిగిన 14వ ఓపెన్‌ తైక్వాండో చాంపియన్‌ షిప్‌ పోటీల్లో రాష్ట్ర తరుపున పాల్గొన్న జిల్లాకు చెందిన 11 మంది క్రీడాకారులు 5 బంగారు, 3 సిల్వర్‌, 3 కాంస్య పతకాలు సాధించి సత్తా చాటారు. రాష్ట్ర వ్యాప్తంగా 61 మంది క్రీడాకారులు పాల్గొంటే జిల్లాకు చెందిన 11 మంది క్రీడాకారులు పథకాలు సాధించడం విజయనగరం చరిత్రలో ఇదే మొదటి సారి.దీంతో జిల్లాకు చేరుకున్న క్రీడాకారులను జిల్లా ఒలింపిక్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు గురాన. అయ్యలు, సిహెచ్‌.వేణుగోపాలరావులు అభినందించారు. జాతీయ స్థాయిలో పథకాలు తేవడం గర్వకారణంగా ఉందన్నారు. ఇదే స్ఫూర్తిని కొనసాగించి అంతర్జాతీయ స్థాయిలో రాణించి జిల్లా ప్రతిష్టను ప్రపంచ వ్యాప్తంగా ఇనుమడింప చేయాలని ఆశాభావం వ్యక్తం చేశారు.