ప్రజాశక్తి-దత్తిరాజేరు(విజయనగరం) : ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ దత్తిరాజేరు మండలం కోమటిపల్లి ఆటో కార్మికులు సిఐటియు ఆధ్వర్యంలో గర్భం రోడ్డు జంక్షన్లో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటో యూనియన్ అధ్యక్షులు బి.అప్పలనాయుడు మాట్లాడుతూ.. నిరంతరం పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం పెంచిన అధిక ఫీజులు, పెనాల్టీలతో డ్రైవర్లంతా ఇబ్బంది పడుతున్నారని, రవాణా రంగాన్ని కార్పోరేట్ కంపెనీలకు కట్టబెట్టేందుకు మోడీ మోటర్ వాహన చట్టం 2020లో సవరణ చేశారని వీటి రద్దు కోసం దేశవ్యాప్తంగా ఆటో వర్కర్స్ అందరూ ఆందోళనకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి పిఎఫ్ ఈఎస్‌ఐ అమలు చేయాలని, ఎస్సీ, ఎస్ టి, బీసీ, మైనార్టీ లకు కార్పొరేషన్ల ద్వారా ఆటోలు కొనుగోలుకు సబ్సిడీలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఆటోలకు పార్కింగ్ స్థలాలు ఇవ్వాలని, ఈ చలానాలు ఆపాలని ఆయన కోరారు. రాష్ట్ర ప్రభుత్వం పెంచిన ఫీజులు, పెనాల్టీ జీవో నెంబర్ 21 ను రద్దు చేయాలని, ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డి గౌరీస్, యు అప్పల రాము, టి హరీష్, ఎల్ రాము, ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.










