Sep 08,2023 19:20

వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడుతున్న కలెక్టర్‌ నాగలక్ష్మి

ప్రజాశక్తి-విజయనగరం :  ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ లో భాగంగా అందిన క్లెయిమ్‌ల న్నిటినీ ఈనెల 15 లోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి తహశీల్దార్లను ఆదేశించారు. ఫారం 6, 7,8 ల ద్వారా అందిన క్లెయిమ్స్‌ శత శాతం ఫిజికల్‌ వెరిఫికేషన్‌ చేసి ఈనెల 15 లోగా ఇఆర్‌ఒ లాగిన్‌ లోకి ఫైనల్‌ రిపోర్ట్‌ పంపాలని సూచించారు. శుక్రవారం ఇఆర్‌ఒలు, ఎఇఆర్‌ఒ లతో కలెక్టర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఫారం 6,7,8 ల ద్వారా ఓటర్ల నమోదుకు, షిఫ్టింగ్‌కు, తొలగింపునకు జిల్లాలో మొత్తం 101283 క్లెయిమ్స్‌ అందాయని, వాటిలో ఇప్పటివరకు 20శాతం పరిష్కారం అయ్యాయని, మిగిలిన 80 శాతం వెంటనే బిఎల్‌ఒ లాగిన్‌లోకి పంపించి వారు వ్యక్తిగతంగా వెరిఫై చేసేలా చూడాలని తెలిపారు. రెండు రోజుల్లో బిఎల్‌ఒల వెరిఫికేషన్‌ పూర్తి చేసి ఎఇఆర్‌ఒ లాగిన్‌ లోకి పంపాలని ఆదేశించారు. ఫారం 7 ద్వారా దరఖాస్తు చేసుకున్నవారికి వారం ముందే నోటీసు లను రిజిస్టర్డ్‌ పోస్ట్‌ ద్వారా పంపాలని తెలిపారు. ఒకే డోర్‌ నెంబర్‌ లో 10 మందికి మించి ఓటర్లు ఉన్న చోటా మరో సారి క్షుణ్ణంగా తనిఖీ చేయాలని తెలిపారు. ఓటర్ల జాబితాల వెరిఫికేషన్‌ తో పాటు పోలింగ్‌ స్టేషన్ల తనిఖీలు కూడా తహశీల్దార్లు చేయాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో సంయుక్త కలెక్టర్‌ మయూర్‌ అశోక్‌, డిఆర్‌ఒ గణపతిరావు, ఆర్‌డిఒ సూర్యకళ , తహశీల్దార్లు, ఎన్నికల డిటి లు, ఎన్నికల సెక్షన్‌ సిబ్బంది పాల్గొన్నారు.