ప్రజాశక్తి -సీలేరు : అక్రమంగా తరలిస్తున్న 43 కేజీల గంజాయిని పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. ఐదుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. స్థానిక ఎస్‌ఐ జె.రామకృష్ణ కథనం ప్రకారం... ముందస్తు సమాచారం మేరకు మంగళవారం మారమ్మ అమ్మవారి ఆలయం సమీపంలో వాహన తనిఖీలు చేపట్టిన పోలీసులు ద్విచక్ర వాహనంపై ముగ్గురు వ్యక్తులు వస్తుండగా ఆ వాహనాన్ని నిలుపుదల తనిఖీ చేశారు. వారివద్ద ఉన్న బ్యాగ్‌లో 43 కేజీల గంజాయి లభ్యమైంది. దీంతో నిందితులను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారించారు. ఈ గంజాయి అక్రమ రవాణాలో సీలేరుకు చెందిన షేక్ ఆలీ, బుద్ధ లోకేష్‌కు ప్రమేయం ఉండగా, తెలంగాణ రాష్ట్రం భద్రాచలం కొత్తగూడెం జిల్లా పాలవంచకు చెందిన సవలము ప్రకాష్, ముదిగుండ ప్రశాంత్ కుమార్, అల్లూరి జిల్లా జి.మాడుగులకు చెందిన శెట్టి విశ్వనాథం గంజాయి తరలింపు చేశారు. నిందితుల నుండి నాలుగు సెల్ ఫోన్లు, రూ.3,200 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురు నిందితులపై కేసు నమోదు చేసి బుధవారం రిమాండ్‌కు తరలించారు. గంజాయి అక్రమ రవాణా చట్టరీత్యా నేరమని, దీనిపై నిరంతరం నిఘా ఉంటుందని, ఎవరు పట్టుబడిన కేసులు తప్పవని ఎస్‌ఐ రామకృష్ణ హెచ్చరించారు.










