ప్రజాశక్తి-విజయనగరం : రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల జగనన్న ఇళ్లలో ఈ నెల 30న సామూహిక గృహప్రవేశాలు జరగనున్నాయని గృహనిర్మాణశాఖ ప్రత్యేక కార్యదర్శి, జిల్లా ప్రత్యేకాధికారి బిఎం దివాన్ తెలిపారు. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని సామర్లకోట వద్ద ముఖ్యమంత్రి జగన్ మోహనరెడ్డి ప్రారంభిస్తారని చెప్పారు. బిఎం దివాన్ జిల్లాలో శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ ఆడిటోరియంలో సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. కలెక్టర్ నాగలక్ష్మి మాట్లాడుతూ జిల్లాలో జగనన్న ఇళ్ల నిర్మాణ ప్రగతిని వివరించారు. జిల్లాలో తొలివిడత 36,030 ఇళ్ల నిర్మాణం లక్ష్యం కాగా, ఇప్పటివరకు సుమారు 34,050 ఇళ్ల నిర్మాణాలు పూర్తయినట్లు చెప్పారు. మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు. వాటిని ఈ నెలాఖరికి పూర్తి చేసి, ప్రారంభానికి సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం బిఎం దివాన్ మాట్లాడుతూ జిల్లాలో బొబ్బిలి జగనన్న లే అవుట్‌లో జిల్లా స్థాయి ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. సామూహిక గృహ ప్రవేశాలకు మరో పది రోజులు మాత్రమే గడువు ఉందని, ఈలోగా ఇచ్చిన లక్ష్యాలకు అనుగుణంగా ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలని కోరారు. దీనికోసం రోజువారీ లక్ష్యాలను ఏర్పాటు చేసుకోవాలని, ప్రతిరోజూ కనీసం 300 ఇళ్ల స్టేజ్ అప్డేషన్ జరగాలని ఆదేశించారు. ఇసుక, సిమెంటు, ఐరన్ లభ్యతపై ఆరాతీశారు. గృహనిర్మాణానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, బిల్లులకు ఎక్కడా సమస్య లేదని చెప్పారు. ఈ నెలలో సుమారు రూ.900 కోట్లు బిల్లులు విడుదల కానున్నాయని తెలిపారు. కనీసం 25 పైబడి ఇళ్లున్న జగనన్న కాలనీకి స్వాగత ద్వారం నిర్మించాలని ఆదేశించారు.
ప్రతిష్టాత్మకమైన పిఎంఎవై అవార్డు ఈసారి కూడా మన రాష్ట్రానికే రావాలని, అందుకు గృహనిర్మాణ శాఖ అధికారులు తమవంతు సహకారాన్ని అందించాలని కోరారు. ఈ వెరిఫికేషన్ బుధవారంలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. వ్యక్తిగత మరుగుదొడ్లు, సోక్ పిట్స్ నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని దివాన్ సూచించారు. సమీక్షా సమావేశంలో జిల్లా గృహనిర్మాణ సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ వి.శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.










