ప్రజాశక్తి- రాజాం : కేంద్రంలో బిజెపి రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు నిరసిస్తూ నిరుద్యోగం, విద్యుత్ ఛార్జీలు, అధిక ధరలకు వ్యతిరేకంగా ఆగస్టు 30 నుండి సెప్టెంబర్ 4 వరకు జరిగే సిపిఎం సమరభేరిలో పెద్ద ఎత్తున ప్రజానికం పాల్గొని జయప్రదం చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ అన్నారు. రాజాంలో ఆదివారం కంట శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలో మతోన్మాద మోడీ ప్రభుత్వం నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో ధరలను అదుపు చేయడంలో ఘోరంగా విఫలమైందన్నారు. ఈ నేపథ్యంలో సమరభేరి కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. ఇందులో భాగంగా సెప్టెంబరు ఒకటిన సంతకాల సేకరణ, 2న గ్రామ, వార్డు సచివాలయాల విజ్ఞాపన పత్రాలు, 3న నిరుద్యోగ వ్యతిరేక దినం, 4న మండల కార్యాలయం వద్ద ధర్నాలు నిర్వహిస్తామని వెల్లడించారు. బిజెపి గద్దెనెక్కిన మొదలు ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేస్తూ కార్పొరేట్లకు బడా పెట్టుబడిదారులకు లక్షల కోట్ల రూపాయలు రాయితీ ఇస్తూ పేద ప్రజలపై పన్నుల భారాన్ని మోపుతోందన్నారు. ఈ విధానాలను జగన్ ప్రభుత్వం తూచా తప్పకుండా మోడీకి భజన చేస్తూ అతి ఉత్సాహంతో అమలు చేస్తుందన్నారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా సిపిఎం పార్టీ సమరభేరి పేరుతో ప్రచారం కార్యక్రమాల నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ సమావేశంలో సిపిఎం పార్టీ నాయకులు శంకర్రావు, రామ్మూర్తి నాయుడు, శ్రీనివాసరావు, సత్యారావు, రాజేష్, విశ్వనాథం, తిరుపతిరావు, గిరి, కృష్ణ, శంకర్రావు తదితరులు పాల్గొన్నారు.
శృంగవరపుకోట: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈనెల 30 నుంచి వచ్చేనెల 4 వరకూ సమరభేరి కార్యక్రమం ద్వారా ఆందోళన, ధర్నాలు నిర్వహిస్తున్నట్లు సిపిఎం మండల కార్యదర్శి మద్దిల రమణ ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం నిరుద్యోగ సమస్య పరిష్కరించడం, అధిక ధరలు అదుపు చేయడంలో ఘోరంగా విఫలమైందన్నారు. మోడీ ప్రభుత్వానికి అదానీ, అంబానీ వంటి కార్పొరేట్లు, బడా ప్రయోజనాలు తప్ప దేశ ప్రజల కష్టాలు పట్టడం లేదని మండిపడ్డారు. నిత్యవసర వస్తువుల ధరలు ప్రతిరోజూ పెరుగుతూ సామాన్య ప్రజలు కొనుక్కుతినే విధంగా లేవని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజా వ్యతిరేక విధానాలపై సమరభేరి నిర్వహిస్తున్నామన్నారు.










