ప్రజాశక్తి-విజయనగరం : ఈ నెల 25న కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయానికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి శంకుస్థాపన చేస్తారని విద్యాశాఖా మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర విద్యాశాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా పాల్గొంటారని తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై విద్యాశాఖా మంత్రి, ఉప ముఖ్యమంత్రి మంత్రి రాజన్నదొర, కలెక్టర్ నాగలక్ష్మి, ఎస్‌పి దీపికతో కలిసి అన్ని శాఖల అధికారులతో ఆదివారం కలెక్టరేట్ ఆడిటోరియంలో సమావేశం ఏర్పాటు చేశారు. సిఎం పర్యటన ఏర్పాట్లపై మంత్రి బొత్స తగు సూచనలు చేశారు. తక్కువ సమయం ఉన్నందున అధికారులంతా సమన్వయంతో పని చేయాలన్నారు. వర్షం పడే అవకాశం ఉన్నందున అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేయాలని సూచించారు.
కలెక్టర్ నాగలక్ష్మి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కార్యక్రమానికి మరడాం వద్ద హెలిపాడ్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ల్యాండ్ లెవెలింగ్, డెకరేషన్, సీటింగ్ ఏర్పాట్లు, తాగునీరు, పారిశుధ్యం ఏర్పాట్లపై సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సమావేశంలో జిల్లా పరిషత్తు చైర్మన్ మజ్జి శ్రీనివాస రావు, ఎమ్మెల్యేలు బొత్స అప్పలనరసయ్య, శంబంగి వెంకట చినప్పల నాయుడు, జెసి మయూర్ అశోక్, డిఆర్‌ఒ గణపతిరావు, ట్రైబల్ యూనివర్సిటీ డీన్ మిశ్రా, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
సభాస్థలి పరిశీలన
దత్తిరాజేరు : కేంద్రీయ గిరిజన యూనివర్సిటీ శంకుస్థాపనకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని, ఎలాంటి లోపాలూ లేకుండా జాగ్రత్తలు తీసుకొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఉపముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర అధికారులను ఆదేశించారు. సిఎం శంకుస్థాపన చేయనున్న కుంటినవలసలోని ప్రాంతాన్ని జెడ్‌పి చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, బొబ్బిలి, గజపతినగరం ఎమ్మెల్యేలు చినప్పలనాయుడు, అప్పలనరసయ్య, గిరిజన యూనివర్సిటీ విసి కట్టమణి, కలెక్టర్ నాగలక్ష్మి, ఎస్‌స్‌పి దీపికతో కలిసి ఆదివారం ఆయన పరిశీలించారు. అధికారులకు, సిబ్బందికి ఏర్పాట్లపై తగిన సూచనలు చేశారు. శంకుస్థాపన ప్రాంతానికి వెళ్ళే రహదారి విస్తరణ చేయాలని, వాహనాల పార్కింగ్ స్థలం చదును చేయాలని సూచించారు.
కార్యక్రమంలో ఆర్‌డిఒ శేషశైలజ, డిఎస్‌పి శ్రీధర్, సిఐలు అప్పలనాయుడు, విజయనాథ్, ఆర్‌అండ్‌బి డిఇ శ్రీనివాసరావు, ఎంపిపి గేదెల సింహాద్రి అప్పలనాయుడు, వైస్ ఎంపిపిలు బమ్మిడి అప్పలనాయుడు, మిత్తిరెడ్డి రమేష్, దత్తిరాజేరు, మెంటాడ తహశీల్దార్లు బి.గురుమూర్తి, రామకృష్ణ పాల్గొన్నారు.










