ప్రజాశక్తి-విజయనగరంటౌన్ : ఈ నెల 21 నుంచి చేపట్టే స్వర్ణోత్సవ ప్రచార యాత్రను విజయవంతం చేయాలని యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రెడ్డి మోహనరావు పిలుపునిచ్చారు. ఆదివారం యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు రమేష్‌చంద్ర పట్నాయక్ అధ్యక్షతన జిల్లా మధ్యంతర కౌన్సిల్ సమావేశాన్ని స్థానిక సిఐటియు కార్యాలయంలో నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్వర్ణోత్సవ ప్రచారయాత్రను ఈ నెల 21 నుంచి 29 వరకు ఇచ్ఛాపురం నుంచి విజయవాడ వరకు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అందులో భాగంగా 22న బొబ్బిలి, గజపతినగరం, విజయనగరంలో, 23న కొత్తవలసలో పతాక ఆవిష్కరణ, సభలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఉపాధ్యాయులు అందరూ పాల్గొని విజయవంతం చెయ్యాలని కోరారు. జిల్లా ప్రధాన కార్యదర్శి జెఎవిఆర్‌కె ఈశ్వరరావు మాట్లాడుతూ సంఘం కార్యకలాపాల నివేదికను ప్రవేశపెట్టి, భవిష్యత్తు కార్యక్రమాలను వెల్లడించారు. సమావేశంలో సిపిఎస్ రద్దు చేసి, ఒపిఎస్‌ను పునరుద్ధరించాలని, జిఒ 117 రద్దు చెయ్యాలని, బోధనేతర పనులు రద్దు చేయాలని, పాఠశాలల నిర్వహణకు నిధులు కేటాయించాలని తీర్మానించారు.
అనంతరం నాయకులు భాస్కర్ ఆడిట్ రిపోర్టు ప్రవేశపెట్టారు. తొలుత ఇటీవల కాలంలో మరణించిన ఉపాధ్యాయులకు సంతాప తీర్మానాన్ని ఎ.సత్యశ్రీనివాస్ ప్రవేశపెట్టగా, సభ్యులంతా మౌనం పాటించారు. సమావేశంలో యుటిఎఫ్ రాష్ట్ర నాయకులు డి.రాము, కె.శ్రీనివాసరావు, జి.పద్మావతి, జి.పార్వతి, కె.ప్రసాదరావు, ఎ.శంకరరావు, ఆర్‌ఎవి సూర్యారావు, కె.శ్రీదేవి, భవాని, పి.రాంప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.










