ప్రజాశక్తి-విజయనగరం కోట : జిల్లా ప్రజల చిరకాల స్వప్నాన్ని నిజం చేస్తూ ఈ నెల 15న విజయనగరం ప్రభుత్వ వైద్య కళాశాలను సిఎం జగన్మోహన్‌రెడ్డి ప్రారంభిస్తారని విద్యాశాఖా మంత్రి బొత్స సత్యనారాయణ, వైద్యారోగ్య శాఖా మంత్రి విడుదల రజని తెలిపారు. దీంతోపాటు రాజమండ్రి, మచిలీపట్నం, నంద్యాల, ఏలూరు వైద్య కళాశాలలను కూడా ముఖ్యమంత్రి ఇక్కడి నుంచే ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి, జెడ్‌పి చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎమ్‌పి బెల్లాన చంద్రశేఖర్, రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి వి.టి.కృష్ణబాబు, ఎపిఎంఎస్ ఐడిసి ఎండి మురళీధరరెడ్డితో కలిసి మంత్రులిద్దరూ శనివారం ప్రభుత్వ వైద్య కళాశాలను సందర్శించారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై కలెక్టర్ నాగలక్ష్మి, ఎస్‌పి దీపిక, జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, ఇతర అధికారులతో సమీక్షించారు. ముఖ్యమంత్రి పాల్గొనే వేదికలపై చర్చించి, పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ విజయనగరం ప్రభుత్వ వైద్య కళాశాలతో పాటు మరో నాలుగు వైద్య కళాశాలలను కూడా ఇక్కడి నుంచే సిఎం ప్రారంభిస్తారని తెలిపారు. ఒక్కో వైద్య కళాశాలను సుమారు రూ.500 కోట్లతో నిర్మిస్తున్నట్లు చెప్పారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని రాష్ట్రంలో 17 వైద్య కళాశాలలను సుమారు రూ.8500 కోట్లతో నిర్మించడానికి సంకల్పించారని చెప్పారు. దీనిలో భాగంగా తొలి విడత నిర్మాణం పూర్తయిన ఐదు వైద్య కళాశాలలను ఈ నెల 15న సిఎం ప్రారంభిస్తారని చెప్పారు. వచ్చే ఏడాది మరో ఐదు వైద్య కళాశాలలు, ఆ మరుసటి ఏడాది మిగిలిన ఏడు వైద్య కళాశాలలను నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించామని మంత్రి తెలిపారు.
వైద్య కళాశాలకు గొప్ప పేరు తేవాలి
విజయనగరం ప్రభుత్వ వైద్య కళాశాలకు గొప్ప పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని విద్యార్థులను మంత్రులు బొత్స సత్యనారాయణ, విడదల రజని కోరారు. ప్రభుత్వ వైద్య కళాశాలను సందర్శించిన సందర్భంగా కళాశాల మొదటి బ్యాచ్ విద్యార్థులను ఉద్దేశించి వారు మాట్లాడారు. ఒకేసారి ఐదు వైద్య కళాశాలలను ప్రారంభిస్తూ, ఏకంగా 750 సీట్లను అదనంగా అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు.
పకడ్బందీగా సిఎం పర్యటన ఏర్పాట్లు
ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను వెంటనే ప్రారంభించాలని కలెక్టర్ నాగలక్ష్మి అధికారులను ఆదేశించారు. ఎక్కడా ఎటువంటి ఇబ్బంది రాకుండా, పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, జెడ్‌పి చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎమ్‌పి బెల్లాన చంద్రశేఖర్, ఎస్‌పి దీపికతో కలిసి హెలిపాడ్ ప్రాంతాన్ని కలెక్టర్ సందర్శించారు. రెండు మూడు చోట్ల పరిశీలించి, అనంతరం జెఎన్‌టియు జంక్షన్ వద్దనున్న స్థలాన్ని ఖరారు చేశారు. పర్యటనలో జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ పాల్గొన్నారు.










