Sep 07,2023 21:35

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ నాగలక్ష్మి

ప్రజాశక్తి-విజయనగరం :  ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈనెల 13నుంచి మండల కేంద్రాల్లో జగనన్నకు చెబుదాం ప్రజా వినతుల పరిష్కార కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు జిల్లా కలెక్టర్‌ ఎస్‌ నాగలక్ష్మి వెల్లడించారు. జిల్లా అధికారులతో పాటు మండల స్థాయి అధికారులంతా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి అందిన వినతులను పరిష్కరిస్తారని పేర్కొన్నారు. జిల్లాలో ఈనెల 13న మొదలై ప్రతి బుధ, శుక్రవారాల్లో మండల కేంద్రాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎంపిడిఒ, తహశీల్దార్లు అవసరమైన ఏర్పాట్లు చేస్తారని తెలిపారు. మండల స్థాయి జగనన్నకు చెబుదాం కార్యక్రమాలు సెప్టెంబరు 13న రాజాం, 15న బొబ్బిలి, 20న ఎస్‌.కోట, 22న నెల్లిమర్ల, 27న గజపతినగరం, 29న చీపురుపల్లిలో ఆయా మండల ప్రజాపరిషత్‌ ప్రాంగణాల్లో నిర్వహిస్తామని తెలిపారు. ప్రజలంతా ఈ కార్యక్రమాన్ని తమ వ్యక్తిగత, సామాజిక సమస్యల పరిష్కారం కోసం వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్‌ కోరారు.
తొలగించిన ఓట్లకు కారణాలు తెలియజేయండి
భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో ఓటర్ల జాబితా సంక్షిప్త సవరణ కార్యక్రమం చాలా పకడ్బందీగా ,ఆన్లైన్‌ ప్రక్రియ ను పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి వెల్లడించారు. గురువారం జిల్లా కలెక్టరేట్‌ సమావేశ మందిరం లో రాజకీయ పక్షాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. తొలగించిన ఓటర్లకు సజావుగా నోటీసులు పంపించే ప్రక్రియ సాగుతోందని తెలిపారు. ముఖ్యంగా మృతి చెందిన ఓటర్లకు సంబంధించి సంబంధిత ధ్రువీకరణ పత్రాలను పొందడం లేదా పంచనామా నిర్వహించి ఓట్లను తొలగించడం ఆన్‌లైన్‌ ద్వారా చేపట్టినట్లు తెలిపారు. జిల్లాలో 74 వేల ఓటర్లను తొలగించామన్నారు. పార్టీల ప్రతినిధుల విజ్ఞప్తి మేరకు అర్బన్‌ ప్రాంతాల్లో మరో రెండు రోజులు బిఎల్‌ఒలు, బిఎల్‌ఎలతో కలసి డోర్‌ టు డోర్‌ వెరిఫికేషన్‌ చేయడానికి అంగీకరించారు. తొలగించిన ఓట్లకు కారణాలను నియోజకవర్గం వారీగా ఒక ఎక్సెల్‌ షీట్‌ లో బిఎల్‌ఎ లకు అందించాలని సూచించారు. సమావేశంలో సంయుక్త కలెక్టర్‌ మయూర్‌ అశోక్‌, డిఆర్‌ఒ గణపతి రావు, ఇఆర్‌ఒలు, ఎఇఆర్‌ఒలు, పలు రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.