Aug 24,2023 20:05

ద్వై వార్షిక నగదు మంజూరు కింద లబ్ధిదారులకు చెక్కు అందజేస్తున్న మంత్రి బొత్స, కలెక్టర్‌ నాగలక్ష్మి

ప్రజాశక్తి-విజయనగరం :  నవరత్నాలు-ద్వై వార్షిక నగదు మంజూరు కార్యక్రమం ద్వారా జిల్లాలో 12,653 మందికి రూ. 57.98 కోట్ల మేర లబ్ధి చేకూరింది. వివిధ సంక్షేమ పథకాలకు అర్హత ఉండి నిర్ణీత సమయంలో దరఖాస్తు చేసుకోలేకపోవడం, బ్యాంకు ఖాతా వివరాలు సరిగా లేకపోవడం తదితర కారణాల వల్ల మిగిలిపోయిన వారికి నవరత్నాలు-ద్వై వార్షిక నగదు మంజూరు కార్యక్రమం ద్వారా లబ్ధి మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాల్లో జమచేసే కార్యక్రమాన్ని గురువారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి.. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కలెక్టరేట్‌ నుంచి విద్యా శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ మజ్జి శ్రీనివాస రావు, కలెక్టర్‌ నాగలక్ష్మి, ఎమ్మెల్సీ రఘురాజు, గ్రామీణాభివృద్ధి, విద్య, బీసీ సంక్షేమం, సాంఘిక సంక్షేమం తదితర శాఖల అధికారులు, వివిధ ప్రాంతాల లబ్ధిదారులతో కలిసి వర్చువల్‌గా హాజరయ్యారు. బటన్‌ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదును జమచేసే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించిన అనంతరం కలెక్టర్‌ నాగలక్ష్మి, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులతో కలిసి పథకాల లబ్ధిదారులు, విద్యార్థులకు రూ. మెగా చెక్కు ను అందజేశారు. కార్యక్రమంలో డిఆర్‌డిఎ పీడీ కళ్యాణ చక్రవర్తి, బిసి సంక్షేమ శాఖ అధికారి యశోధన రావు, వివిధ శాఖల అధికారులు, పథకాల లబ్ధిదారులు తదితరులు హాజరయ్యారు.