ప్రజాశక్తి- విజయనగరం: పట్టణ పరిధిలో 12 ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేసి అతని వద్ద నుంచి 27 తులాల బంగారు ఆభరణాలు, 6కిలోల వెండిని స్వాధీనం చేసుకున్నట్లు విజయనగరం డిఎస్‌పి ఆర్. గోవిందరావు తెలిపారు. ఒకటో పట్టణ పోలీసు స్టేషన్‌లో సోమవారం విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించారు. మెంటాడ మండలం కొప్పంగి గ్రామానికి చెందిన కె. శ్రీనివాసరావు ప్రస్తుతం విజయనగరం పట్టణంలోని ఉడాకాలనీలో నివాసం ఉంటున్నాడు. గతంలో సిఆర్‌పిఎఫ్ కానిస్టేబుల్‌గా పదేళ్లు పనిచేసిన శ్రీనివాసరావు ఉద్యోగం మానేసి చెడు వ్యసనాలకు అలవాటు పడ్డాడు. ఈ నేపథ్యంలోనే ఉడాకాలనీ, బాబామెట్ట ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడ్డాడు. ఈ మేరకు ఒకటో పట్టణ సిఐ బి. వెంకటరావు ఆధ్వరంలో ఒక బృందం శ్రీనివాసరావును పట్టుకునేందుకు ప్రయత్నించగా ఆదివారం స్థానిక సాలిపేట ప్రాంతంలో గురజాడ పబ్లిక్ స్కూల్ రోడ్డు వద్ద పట్టుబడ్డాడు. ఇతను ఒకటో పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలోని ఏడు నేరాలు, రెండో పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలోని ఐదు నేరాలకు పాల్పడ్డాడు. సంవత్సరకాలంలో 12 దొంగతనాలకు పాల్పడగా ఆయన వద్ద నుంచి రూ. 25లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలు, వెండి స్వాధీనం చేసుకున్నామని డిఎస్‌పి తెలిపారు. దొంగను పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన పోలీసులను ఆయన అభినందించారు.










