Sep 09,2023 21:20

ధర్నా పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న సిఐటియు నాయకులు

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : ఆటో డ్రైవర్లపై పోలీసుల వేధింపులు ఆపాలని, అక్రమ కేసులు రద్దు చేయాలని ఈ నెల 11న కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేపడుతున్నట్లు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె.సురేష్‌ తెలిపారు. శనివారం ఎల్‌బిజి భవనంలో ధర్నా పోస్టర్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సురేష్‌ మాట్లాడుతూ ఆటో స్టాండ్లకు వెళ్లి 336 సెక్షన్‌ కింద ఆటో డ్రైవర్లపై బలవంతంగా అక్రమ కేసులు పెడుతున్నారని, అంగీకరించక పోతే బెదిరిస్తున్నారని తెలిపారు. వేలల్లో జరిమానాలు వేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ చర్యలను కనకదుర్గా ఆటో వర్కర్స్‌ యూనియన్‌ ఖండిస్తోందన్నారు. ఆటో డ్రైవర్లపై పెట్టిన అక్రమ కేసులు బేషరతుగా రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. డ్రైవర్లతో పోలీసులు స్నేహపూర్వకంగా వ్యవహరించాలని, పార్కింగ్‌ స్థలాలు ఇవ్వాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఫీజులు, పెనాల్టీలు పెంచుతూ విడుదల చేసిన జిఒ 21ను రద్దు చేయాలని, మోటారు వాహన చట్టం-2020ని రాష్ట్రంలో అమలు చేయొద్దని డిమాండ్‌ చేశారు.
పెట్రోల్‌, డీజిల్‌ ధర తగ్గించాలన్నారు. వీటన్నింటిపై కలెక్టరేట్‌ వద్ద చేపట్టే ధర్నాను ఆటో డ్రైవర్లు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు టి.సూర్యనారాయణ, టి.వి.రమణ, జిల్లా కార్యదర్శి బి.సూర్యనారాయణ, నగర అధ్యక్ష, కార్యదర్శి ఎ.జగన్మోహన్‌, బి.రమణ, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.