10న కలెక్టరేట్ వద్ద కెజిబివి కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ఉద్యోగులనిరాహారదీక్ష
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : సమగ్ర శిక్షా, కెజిబివిల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ , పార్ట్ టైం ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఈనెల 10న కలెక్టరేట్ వద్ద 'వేడుకోలు' పేరిట నిరాహారదీక్ష చేయనున్నట్లు సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జెఎసి జిల్లా చైర్మన్ బి.కాంతారావు తెలిపారు. బుధవారం ఎన్‌పిఆర్ భవనంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశలంలో ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు.
ప్రభుత్వ శాఖలు, విద్యాసంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు ఎంటిఎస్ అమలు చేసి, వేతనాలు పెంచి 15 నెలలు గడుస్తున్నా సమగ్ర శిక్షా ఉద్యోగుల వేతనాల పెంపు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏ మాత్రం చొరవ చూపడం లేదని తెలిపారు. ధరలకు అనుగుణంగా వేతనాలు లేకపోవడంతో జీవనం దుర్భరంగా మారిందన్నారు. కాంట్రాక్టు, ఔట్సొర్సింగ్ , పార్ట్ టైం ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, సమాన పనికి సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. అందరికీ మినియం టైం స్కేల్ అమలు చేసి, వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఉన్న పార్ట్ టైం విధానాన్ని రద్దు చేసి, ఫుల్ టైం కాంట్రాక్టు విధానాన్ని అమలు చేసి వేతనాలు పెంచాలన్నారు. కరువు భత్యం, ఇంటి అద్దె సౌకర్యం, 10 లక్షలు రిటైర్మెంట్ బెనిఫిట్ గ్రాట్యుటీ కల్పించాలని కోరారు. పిఎఫ్, ఈ ఎస్ ఐ, అమలు చేయాలన్నారు.వేతనం తో కూడిన మెడికల్ లీవులు మంజూరు చేయాలన్నారు. మహిళా ఉద్యోగులకు చైల్డ్ కేర్ లీవులు మంజరు చేయాలని, ప్రతి నెల ఒకటి తేదీకి వేతనాలు చెల్లించాలని, వేతనాలు కోసం సంవత్సరానికి సరిపడే బడ్జెట్ ఒకేసారి విడుదల చేయాలని కోరుతూ చేపట్టనున్న ఈ నిరాహారదీక్షలో ఉద్యోగులంతా పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. విలేకర్ల సమావేశంలో కృష్ణంనాయుడు, ఎర్రినాయుడు, అప్పారావు, పైడిరాజు, సిఅర్‌ఎంటి ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. గురువులు, జిల్లా నాయకులు లక్ష్మణరావు, కె. పార్వతి పాల్గొన్నారు.










