ప్రజాశక్తి- శృంగవరపుకోట : నెలలు నిండిన గిరిజన గర్భిణీని ప్రసవం నిమిత్తం శనివారం పట్టణంలోని ఏరియా ఆసుపత్రికి 108 వాహనాలో తరలిస్తుండగా మార్గం మధ్యలో వాహనంలోనే ప్రసవించింది. ఈమేరకు 108 పైలెట్ మూర్తి, టెక్నీషియన్ సత్యారావు తెలిపారు. అల్లూరి జిల్లా, అనంతగిరి మండలం గంగవరం గ్రామానికి చెందిన అర్జుపు సుఖరమ్మకు పురిటి నొప్పులు రావడంతో 108 వాహనంలో ఎస్‌కోట ఏరియా ఆసుపత్రికి తీసుకొస్తుండగా మండలంలోని రాజంపేట గ్రామ సమీపంలో ఆమె 108 వాహనంలో ప్రసవించింది. గర్భిణికి తీవ్ర నొప్పులు రావడంతో బొడ్డవర దాటిన తరువాత వాహనాన్ని రోడ్ పక్కకు ఆపివేసి సిబ్బంది డెలివరీ చేయించారు. ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చింది. పైలట్ మూర్తి, టెక్నీషియన్ సత్యారావులు చాకచక్యంగా డెలివరీ చేసి తల్లీ బిడ్డలను క్షేమంగా ఎస్.కోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డ్యూటీ డాక్టర్ ఉదయకుమార్ ప్రథమ చికిత్స అందించి తల్లీ బిడ్డ ఆరోగ్యంగా వున్నారని 108 సిబ్బందిని అభినందించారు.










